Telugu Global
Telangana

కాంగ్రెస్‌ సెకండ్ లిస్ట్‌ ఫైనల్‌.. రిలీజ్ ఎప్పుడంటే..!

లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు ఫైనల్ అయినప్పటికీ.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదని సమాచారం. అయితే లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినప్పటికీ.. ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కాంగ్రెస్‌ సెకండ్ లిస్ట్‌ ఫైనల్‌.. రిలీజ్ ఎప్పుడంటే..!
X

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ఢిల్లీలో వరుసగా రెండు రోజులు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. మొదటి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ.. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికను స్పీడప్ చేసింది. ఇప్పటివరకూ 35-40 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఈనెల 25న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. అదే రోజు కాంగ్రెస్‌ తన రెండో లిస్టు రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు ఫైనల్ అయినప్పటికీ.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదని సమాచారం. అయితే లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినప్పటికీ.. ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు.. సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా, వైరా బదులు పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ కోసం అన్ని సిద్ధం చేసుకున్నారు. దీంతో పాలేరు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. వైరాతో సరిపెట్టుకోవాలని సీపీఎం నేతలను ఒప్పించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం లెఫ్ట్‌ పార్టీలతో కూర్చొని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

First Published:  23 Oct 2023 2:05 AM GMT
Next Story