Telugu Global
Telangana

80 మందితో కాంగ్రెస్‌ ఫస్ట్ లిస్ట్‌ రెడీ.. ప్రకటన ఎప్పుడంటే..?

ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీకి సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది.

80 మందితో కాంగ్రెస్‌ ఫస్ట్ లిస్ట్‌ రెడీ.. ప్రకటన ఎప్పుడంటే..?
X

అభ్యర్థుల ఎంపిక అంశాన్ని కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ పార్టీ దాదాపు ముగింపు దశకు తెచ్చినట్లు తెలుస్తోంది. కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్ అధ్యక్షతన శుక్రవారం 5 గంటల పాటు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. మొత్తంగా 80కి పైగా స్థానాల్లో అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలతోపాటు ఇద్దరు చొప్పున పోటీ ఉన్న చాలా నియోజకవర్గాల్లో దరఖాస్తులను వడపోసి లిస్ట్‌ ఫైనల్ చేశారు. ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేష్‌ మేవానీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కి, పార్టీ ఎన్నికల స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పాల్గొన్నారు.

గురువారం 7 గంటలపాటు, శుక్రవారం 5 గంటలపాటు మొత్తం 12 గంటలపాటు స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం సాగింది. ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్టును ఇవాళ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపనున్నారు. అక్కడి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత..ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో 80కి పైగా అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ రిలీజ్ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు తగిన స్థాయిలో సీట్లు ఇవ్వాలని నిబంధన పెట్టుకోవడంతో 20 స్థానాల విషయంలో స్క్రీనింగ్ కమిటీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీకి సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని ఎల్బీనగర్ స్థానానికి మధుయాష్కి దరఖాస్తు చేశారు. ఆయనకు టికెట్ కేటాయింపు విషయంలో.. స్థానిక నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని మరోస్థానం జూబ్లిహిల్స్ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే విష్ణు, సీనియర్ నేత అజారుద్దీన్ పోటీ పడుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గం విషయంలోనూ స్క్రీనింగ్ కమిటీ ఎటు తేల్చలేకపోయినట్లు సమాచారం. ఇక మల్కాజిగిరి నియోజకవర్గాన్ని సైతం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

తీగల కృష్ణారెడ్డి పార్టీలో చేరతారని భావించినా ఆయన రాకపోవడంతో బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహరెడ్డి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌ స్థానానికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌, చేవేళ్ల నుంచి ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ భూపతిగళ్ల మహిపాల్‌ వైపు స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, నకిరేకల్ స్థానాల విషయంలో క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఇక పాలేరు టికెట్‌ కోసం పొంగులేటి.. తుమ్మల పోటీ పడుతున్నారు. అయితే తుమ్మలను ఖమ్మం పంపాలని చూస్తున్నప్పటికీ ఆయన అక్కడ నుంచి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఇల్లెందు నుంచి అత్యధికంగా 32 మంది దరఖాస్తు చేసుకోగా.. మాజీ ఎంపీ పొంగులేటి తన అనుచరుడు కోరం కనకయ్యకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఇక్కడ కోయ, లంబాడా సామాజిక వర్గాల సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ నియోజకవర్గాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. ఇక టికెట్లు ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు ఢిల్లీలోనే మకాం వేసి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

First Published:  23 Sep 2023 1:49 AM GMT
Next Story