Telugu Global
Telangana

టీకాంగ్ నేతల పోటాపోటీ యాత్రలు

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయాలని ఏఐసీసీ చెప్పిందని, చేయకపోతే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి

టీకాంగ్ నేతల పోటాపోటీ యాత్రలు
X

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్ లో అది మరీ ఎక్కువ. వరుస ఓటములు ఎదురవుతున్నా.. వర్గాలు, గ్రూపుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. వచ్చే అవకాశం కూడా కనిపించడంలేదు. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి గతంలో పాదయాత్ర మొదలు పెడితే ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవాంతరాలు. తాజాగా ఆయన హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో మరింతమంది యాత్రికులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. ఆల్రడీ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి యాత్ర మొదలు పెట్టారు.

‘తెలంగాణ కాంగ్రెస్‌ పోరు యాత్ర’ పేరుతో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు. ఏఐసీసీ అనుమతితో బాసర నుంచి హైదరాబాద్‌ వరకు యాత్ర మొదలు పెట్టారు. ఏలేటి యాత్రను రేవంత్ యాత్రకు పోటీగా భావించలేం కానీ.. ఆయన మొదలు పెట్టిన యాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వంటి కీలక నేతలు పాల్గొనడం రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చకు తావిస్తోంది.

భట్టి విక్రమార్క ఇప్పటికే పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో మధిర నియోజకవర్గంలో గతంలోనే యాత్ర పూర్తి చేశారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల్లో భాగంగా మళ్లీ ‘పీపుల్స్‌ మార్చ్‌’పేరుతో రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ యూనివర్శిటీల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర మొదలు పెట్టడానికి రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తనతో పాటు తన సతీమణి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో యాత్రకు రెడీ అవుతున్నారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో బైక్‌ యాత్ర చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతలు నెల రోజులపాటు హాథ్ సే హాథ్ యాత్ర చేపట్టాలని అధిష్టానం ఆదేశాలున్నా.. ఇక్కడ ఎవరికి వారే సొంత యాత్రలు, సొంతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయాలని ఏఐసీసీ చెప్పిందని, చేయకపోతే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి.

First Published:  4 March 2023 2:39 AM GMT
Next Story