Telugu Global
Telangana

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టాలంటూ తెలంగాణ పీసీసీ తీర్మానం

రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని.. దేశంలో నడుస్తున్న విద్వేష రాజకీయాలకు ఆయన చరమగీతం పాడుతారని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టాలంటూ తెలంగాణ పీసీసీ తీర్మానం
X

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలంటూ తెలంగాణ పీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. బుధవారం రెడ్ రోజ్ ప్యాలెస్‌లో జరిగిన టీపీసీసీ కొత్త కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టగా.. షబ్బీర్ అలీ దాన్ని బలపరిచారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని.. దేశంలో నడుస్తున్న విద్వేష రాజకీయాలకు ఆయన చరమగీతం పాడుతారని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా, రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై రాజస్థాన్ పీసీసీ తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేసింది తెలంగాణ పీసీసీ కావడం గమనార్హం.

రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా చరిష్మా ఉందని, ఆయనకు దేశంలోని సమస్యల పట్ల అవగాహన ఉందని.. అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్టే పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంటుందని నల్గొండ ఎంపీ, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేరళలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిశారు. ఆయన ఓకే అన్న తర్వాతే టీపీసీసీలో కొత్త సభ్యుల నియామకం జరుగుతోంది. టీపీసీసీ ఆమోదించిన తీర్మానాన్ని త్వరలో ఏఐసీసీకి పంపనున్నారు. అలాగే ముఖ్య నాయకులు వెళ్లి మరోసారి రాహుల్ గాంధీని కలవనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడానికి ఇదే సరైన సమయం అని ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, మల్లు రవి అంటున్నారు.

మరోవైపు పీసీసీ అధ్యక్షుడు, ఆఫీస్ బేరర్లు, ఏఐసీసీ ప్రతినిధులను నామినేట్ చేయడానికి ఏఐసీసీ ప్రెసిడెంట్‌కు అధికారం ఇస్తూ టీపీసీసీ భేటీలో తీర్మానం చేశారు.

First Published:  21 Sep 2022 1:47 PM GMT
Next Story