Telugu Global
Telangana

టీకాంగ్ లో బూతుల పంచాంగం.. అధిష్టానం ముందు పంచాయితీ

నేరుగా సుధాకర్ కి ఫోన్ చేసి తిట్టినా అంతగా ఫీల్ అయ్యేవారు కాదేమో, ఆయన కొడుక్కి కాల్ చేసి బండబూతులు తిట్టడంతో బాగా ఫీలయ్యారు. వెంకట్ రెడ్డికి మతి ఉందా పోయిందా అంటూ మండిపడ్డారు సుధాకర్.

టీకాంగ్ లో బూతుల పంచాంగం.. అధిష్టానం ముందు పంచాయితీ
X

తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కడ ఎప్పుడు ఏ గడబిడ జరిగినా దానికి కోమటిరెడ్డి సోదరులతో లింకు ఉండే ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి నిష్క్రమణ తర్వాత ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు మరింత బలంగా వినపడుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సఖ్యతగా లేకపోవడం, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంనుంచి తప్పించుకోవడం, ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ కి అంత సీన్ లేదని చెప్పడం.. ఇలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడూ టాక్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్ గా ఉంటున్నారు. తాజాగా ఆయన మరోసారి వివాదాల్లోకెక్కారు. తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పై ఆయన ఫోన్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై సుధాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

చెరుకు సుధాకర్ తనయుడు చెరుకు సుహాస్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఈ ఆడియోలో వెంకట్ రెడ్డి సుధాకర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వినరాని బూతులు తిట్టారు. నేరుగా సుధాకర్ కి ఫోన్ చేసి తిట్టినా అంతగా ఫీల్ అయ్యేవారు కాదేమో, ఆయన కొడుక్కి కాల్ చేసి బండబూతులు తిట్టడంతో బాగా ఫీలయ్యారు. వెంకట్ రెడ్డికి మతి ఉందా పోయిందా అంటూ మండిపడ్డారు సుధాకర్.

తాను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా, వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా ఉండి.. ఒకే పార్టీకోసం కలసి పని చేస్తున్నా కూడా తనపై ఆయన అలాంటి భాష ఉపయోగించడమేంటి అని బాధపడుతున్నారు సుధాకర్. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కామెంట్ చేయలేదని, కానీ తనజోలికొస్తే ఊరుకోబోనని అంటున్నారు సుధాకర్. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసభ్య పదజాలంతో తనను తిట్టిన ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపించానని చెప్పారు. ఆయనపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దృష్టిలో, తెలంగాణ ప్రజల దృష్టిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డక్ ఔట్ అయిన వికెట్ అని చెరుకు సుధాకర్ విమర్శించారు.

First Published:  5 March 2023 4:40 PM GMT
Next Story