Telugu Global
Telangana

సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు.. పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం

సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంలో ప్రత్యేక అధికారులకే అన్ని బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఫిబ్రవరి 2న వీరంతా విధుల్లో చేరతారు.

సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు.. పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మున్సిపాల్టీల పాలక వర్గాల్లో ఫిరాయింపులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధీనంలో ఉన్న మున్సిపాల్టీలు కాంగ్రెస్ చేతికి చిక్కబోతున్నాయి. మరోవైపు సర్పంచ్ ల ఎన్నికలకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సర్పంచ్ ల పదవీకాలం పొడిగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోలేదు. ప్రత్యేక అధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది.

చెక్ పవర్ రద్దు..

రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంలో బుధవారమే వారి నుంచి చెక్ బుక్కులు స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

పెత్తనం ప్రత్యేక అధికారులకే..

సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంలో ప్రత్యేక అధికారులకే అన్ని బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఫిబ్రవరి 2న వీరంతా విధుల్లో చేరతారు. చెక్ బుక్ లు, డిజిటల్‌ సంతకాలతో కూడిన పెన్ డ్రైవ్ లను వారి వద్దే ఉంచుతారు. ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకోవచ్చని తెలిపింది. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఎంపీడీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించబోతోంది ప్రభుత్వం. త్వరలోనే గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

First Published:  31 Jan 2024 2:14 AM GMT
Next Story