Telugu Global
Telangana

కర్నాటక ఫార్ములాపై టీ కాంగ్రెస్‌ కసరత్తు

గ్యారెంటీ కార్డులను రూపొందించే విషయంలో కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నమే చేస్తోందట. మేధావులు, నిపుణులతో పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరించి హామీలను రూపొందించాలనుకుంటోందట.

కర్నాటక ఫార్ములాపై టీ కాంగ్రెస్‌ కసరత్తు
X

తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ తహతహలాడుతోంది. కర్నాటక ఫలితాలతో కొత్త ఆశలు నింపుకొని స‌మ‌రానికి సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కర్నాటక తరహా గ్యారెంటీ కార్డులను రూపొందిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో గ్యారెంటీ కార్డులు ఓట్ల వర్షం కురిపించడంతో అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలనుకుంటోంది టీ కాంగ్రెస్‌.

ఎన్నికల వ్యూహాలకు తెలంగాణ కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే పదును పెట్టింది. పార్టీ తరుఫున ఇచ్చే ప్రతి హామీని క‌చ్చితంగా అమలు చేస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలనుకుంటోంది. అందుకోసం గ్యారెంటీ కార్డులను ప్రయోగించనుంది టీ కాంగ్రెస్‌. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చే హామీల పూర్తిస్థాయిలో నెరవేరుతాయనే విశ్వాసం ప్రజల్లో లేదు. ఈ అపనమ్మకాన్ని దూరం చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు మొదలు పెట్టింది.

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు గ్యారెంటీ కార్డులను ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రజా సమస్యలను కార్డుపై ముద్రించి, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామనే హామీతో కార్డును పంచాలనుకుంటోంది. గ్యారెంటీ కార్డు ఉన్నవారు నేరుగా సంబంధిత అధికారులతో సంపద్రింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందవచ్చు. సమస్య పరిష్కారంకాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఇలాంటి కార్డులను అందించడం ద్వారా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు.

గ్యారెంటీ కార్డులను రూపొందించే విషయంలో కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నమే చేస్తోందట. మేధావులు, నిపుణులతో పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరించి హామీలను రూపొందించాలనుకుంటోందట. ధరణిపై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ భూసమస్యల పరిష్కారం కోసం గ్యారెంటీ కార్డును సిద్ధం చేస్తోందట. అలాగే అన్ని వర్గాలకు చెందిన వారి సమస్యలను అధ్యయనం చేసి, వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ గ్యారెంటీ కార్డులు సిద్ధం చేస్తున్నారట. ఇలా అన్ని వర్గాల ప్రజలకు గ్యారెంటీ కార్డులు ఇవ్వడం ద్వారా కర్నాటక ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్‌ అవుతాయని టీ-కాంగ్‌ నేతలు భావిస్తున్నారు. మరి కాంగ్రెస్‌ కార్డుల వ్యూహం ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.

First Published:  15 Jun 2023 5:23 AM GMT
Next Story