Telugu Global
Telangana

బీసీలకు మొండి 'చెయ్యి'.. పొన్నాల ఎపిసోడ్ తో పిక్చర్ క్లారిటీ

పొన్నాలకే ఆ స్థాయిలో కౌంటర్ ఇస్తే.. ఇక కాంగ్రెస్ లో సాధారణ బీసీ నేతల పరిస్థితి ఏంటనే విమర్శలు వినపడుతున్నాయి. బీసీలకు టికెట్లు ఇవ్వకపోగా.. గెలవలేరు అనే నిందవేస్తూ కించపరచడం సరికాదంటున్నారు నేతలు.

బీసీలకు మొండి చెయ్యి.. పొన్నాల ఎపిసోడ్ తో పిక్చర్ క్లారిటీ
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు కావాలంటూ ఆవర్గం నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ దశలో ఆ డిమాండ్ కాస్తా అభ్యర్థనగా మారిపోయింది. చివరకు అధిష్టానం ఎన్ని సీట్లు ఇస్తే అన్నిటితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు టికెట్ ఖరారు కాదని తేలిపోవడంతో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడారు. వెళ్తూ వెళ్తూ కాంగ్రెస్ లో బీసీలకు అవమానం జరిగిందని నిందవేశారు. నడమంత్రపు నాయకత్వం అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోని బీసీ నాయకుల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తించారు పొన్నాల.

ఎన్నిసీట్లు..?

34 అసెంబ్లీ సీట్లు అనేది అసంభవం అని తేలిపోయింది. కనీసం 20 సీట్లయినా ఇస్తారా అంటే అది కూడా అసాధ్యం అంటున్నారు. ఈ దశలో రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు తాము బీసీలకిస్తామన్నారు రేవంత్ రెడ్డి. పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలు ఉన్నా, లేకున్నా ఒకటేనన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయన ఘోరంగా ఓడిపోయారని దెప్పిపొడిచారు. పొన్నాలకే ఆ స్థాయిలో కౌంటర్ ఇస్తే.. ఇక కాంగ్రెస్ లో సాధారణ బీసీ నేతల పరిస్థితి ఏంటనే విమర్శలు వినపడుతున్నాయి. బీసీలకు టికెట్లు ఇవ్వకపోగా.. గెలవలేరు అనే నిందవేస్తూ కించపరచడం సరికాదంటున్నారు నేతలు.

టార్గెట్ రేవంత్..

ఇటీవల అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేశారు. పొన్నాల ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లోని బీసీ నేతలకు కూడా రేవంత్ శత్రువుగా మారారు. "గెలవలేడు, సిగ్గుండాలి, సచ్చేముందు ఏం రోగం వచ్చింది.." అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో మరింతమంది బీసీ నేతలు నొచ్చుకున్నట్టు సమాచారం. మొత్తమ్మీద పొన్నాల ఎపిసోడ్ తో బీసీ నేతలకు ఒక విషయంలో మరింత క్లారిటీ వచ్చింది.

First Published:  14 Oct 2023 3:06 AM GMT
Next Story