Telugu Global
Telangana

రేవంత్ రెడ్డిపై అధిష్టానం అసంతృప్తి.. ప్రియాంక చేతికి తెలంగాణ వ్యవహారాలు?

తెలంగాణ అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఇప్పటికైనా పార్టీని గాడిలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

రేవంత్ రెడ్డిపై అధిష్టానం అసంతృప్తి.. ప్రియాంక చేతికి తెలంగాణ వ్యవహారాలు?
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పని తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తితో ఉన్నది. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లను కాదని, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది. సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పి మరీ రేవంత్‌కు పదవి ఇస్తే.. ఆయన పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని అధిష్టానం భావిస్తోంది. రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇచ్చే సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్లు పూర్తిగా వ్యతిరేకించారు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. అయితే, వారితో కలిసి పని చేయాలని చెప్పినా.. రేవంత్ రెడ్డి మాత్రం చొరవ తీసుకోలేదు.

పీసీసీ చీఫ్ పదవి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి రేవంత్‌తో కలిసి పని చేయడానికి నిరాకరిస్తూ వచ్చారు. మిగిలిన సీనియర్లు కలిసినట్లే కలిసి.. తిరిగి రేవంత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేశారు. అంతే కాకుండా టీపీసీసీ కార్యవర్గంలో అంతా తన మనుషులే ఉండేలా రేవంత్ పావులు కదిపారు. ఇది సీనియర్లకు మరింత ఆగ్రహం తెప్పించింది. జగ్గారెడ్డి మొదట్లో రేవంత్‌తో కలిసినట్లే కనిపించినా.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు తనను పిలవడం లేదని అలిగారు. కనీసం సంగారెడ్డి వచ్చిన సమయంలో కూడా తనకు సమాచారం ఇవ్వలేదని మీడియా ముందు వాపోయారు.

రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని అధిష్టానం ఆదేశించినా.. ఏదో ఒకటి రెండు కార్యక్రమాలతో రేవంత్ సరిపెట్టారు. ఇక పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరుగా వేరే పార్టీల్లో చేరుతున్నా.. వారిని నిలువరించడంలో రేవంత్ విఫలమైనట్లు అధిష్టానం భావిస్తోంది. కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందో అగ్రనాయకత్వానికి తెలియజేయలేదని మండిపడుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్‌తో కలిసి పార్టీని చక్కదిద్దుతారని భావిస్తే.. అలా జరగకపోగా, పరిస్థితి మరింతగా దిగజారిపోవడాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నది.

తెలంగాణ అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఇప్పటికైనా పార్టీని గాడిలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడిని మార్చకపోయినా.. రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల నుంచి మాణిక్యం ఠాకూర్‌ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇకపై తెలంగాణ వ్యవహారాలను ప్రియాంక గాంధీ చేతికి అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రియాంక కూడా సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగే ఏ విషయాన్నైనా తనకు రిపోర్టు చేయాలని ప్రియాంక ఇప్పటికే రాష్ట్ర నేతలకు చెప్పినట్లు సమాచారం. రేవంత్ రెడ్డిపై సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారని, తమ కంటే జూనియర్ అనే అహం కూడా వారిలో ఉందని ప్రియాంక భావిస్తున్నారు. అందుకే ఏమైనా ఉంటే తనకు చెప్పాలని సీనియర్లకు సూచించినట్లు తెలుస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్‌లోని కీలక నేతలు గతంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక మిగిలిన సీనియర్లు బీజేపీ బాట పడుతున్నారు. రాష్ట్రంలో సరైన నాయకులు లేని బీజేపీ.. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులను కూడా టార్గెట్ చేసింది.అందుకే ఈ వలసలను మొదట నిరోధించాలని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భావిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్ పని చేయడం లేదని అధిష్టానం భావిస్తోంది. వాళ్లు పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉంటూ.. పార్టీ పనులకు మాత్రం దూరంగా ఉంటున్నట్లు తెలుసుకున్నది. అందుకే వారిని ఆ పదవుల నుంచి తప్పించి వేరే బాధ్యతలు అప్పగించాలని అనుకుంటోంది. వారి స్థానంలో కొత్త వారికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశం ఇవ్వనున్నది. యువ నాయకత్వానికి పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలో ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నది. ప్రస్తుతానికి ప్రియాంక గాంధీ అనధికారికంగా తెలంగాణ బాధ్యతలు చూస్తున్నా.. త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉన్నది.

First Published:  26 Nov 2022 2:21 AM GMT
Next Story