Telugu Global
Telangana

గడ్కరీతో రేవంత్ రెడ్డి భేటీ..

గడ్కరీతో జరిగిన భేటీకి సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా హాజరయ్యారు.

గడ్కరీతో రేవంత్ రెడ్డి భేటీ..
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో బిజీగా మారిపోయారు. తాజాగా ఆయన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితోపాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా ఈ భేటీలో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరి హైవే, సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ జాతీయ రహదారి అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోప్ బ్రిడ్జ్ ని మరోచోటకు మార్పు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున గడ్గరీకి వినతిపత్రం అందించారు సీఎం రేవంత్ రెడ్డి.

గడ్కరీతో జరిగిన భేటీకి సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ సహా ఇతర కేంద్ర మంత్రుల్ని కలసి వినతిపత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్లిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి వినతిపత్రాలిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశారు.

కేంద్రం కరుణిస్తుందా..?

ఎన్నికల వేళ కేంద్రం దగ్గరకు వెళ్లి నిధులు కోరడం ఎన్నికల స్టంట్ గా ప్రతిపక్ష బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. తెలంగాణపై ఇప్పటి వరకు కరుణ చూపని బీజేపీ ప్రభుత్వం.. కాంగ్రెస్ విజ్ఞప్తులను పట్టించుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  20 Feb 2024 2:43 PM GMT
Next Story