Telugu Global
Telangana

లోక్ సభ ఎన్నికలే టార్గెట్.. ఉద్యోగులకు తాయిలాలు

ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఎప్పుడూ సానుకూలంగా ఉన్నట్టే ప్రకటిస్తాయి. కానీ ఎప్పటిలోగా ఆయా సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేదే అసలు పాయింట్.

లోక్ సభ ఎన్నికలే టార్గెట్.. ఉద్యోగులకు తాయిలాలు
X

పేద, మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకోడానికి ఎలాగూ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలపై ఉన్న నమ్మకం ఓట్లు వేయిస్తే.. ఇప్పుడు ఒక్కో పథకాన్ని పట్టాలెక్కిస్తూ లోక్ సభ ఎన్నికలనాటికి ప్రజలను పూర్తిగా తమవైపు తిప్పుకోడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఉద్యోగ వర్గానికి కూడా తాయిలాలివ్వడం మొదలు పెట్టింది. ఆల్రడీ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి సంతోష పరిచారు. ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు కూడా గుడ్ న్యూస్ చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం ఆయా సంఘాల నేతలతో సీఎం సమావేశం కాబోతున్నారు.

జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈమేరకు సీఎంవో నుంచి టీఎన్జీవో, టీజీవోలతో పాటు గుర్తింపు పొందిన టీచర్ల సంఘాల్లోని నేతలకు కూడా సమాచారం వెళ్లింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌, ఉద్యోగుల మెడికల్‌ బిల్స్‌, సీపీఎస్‌ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.

కాంగ్రెస్ సానుకూలం..

ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఎప్పుడూ సానుకూలంగా ఉన్నట్టే ప్రకటిస్తాయి. కానీ ఎప్పటిలోగా ఆయా సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేదే అసలు పాయింట్. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం డెడ్ లైన్ ఉంది. లోక్ సభ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగులకు తాయిలాలిచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ రోజు భేటీ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన ఉంటుందో చూడాలి.

First Published:  10 March 2024 6:21 AM GMT
Next Story