Telugu Global
Telangana

కొత్త బిల్డింగ్స్‌ కట్టేది లేదు.. - రేవంత్ రెడ్డి క్లారిటీ

సీఎం క్యాంప్ ఆఫీసు విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేస్తామన్నారు.

కొత్త బిల్డింగ్స్‌ కట్టేది లేదు.. - రేవంత్ రెడ్డి క్లారిటీ
X

తెలంగాణలో శాసనమండలికి కొత్త భ‌వ‌నం కడతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి కొత్త భవనాలు కట్టబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతమున్న శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామన్నారు. పార్లమెంట్ తరహాలో శాస‌న‌మండలి, శాసనసభ ఉంటాయని స్పష్టం చేశారు.

కొత్తగా ఎలాంటి వాహనాలు కూడా కొనుగోలు చేయమన్నారు రేవంత్ రెడ్డి. అనవసరమైన, దుబారా ఖర్చులు తగ్గించుకుంటామని ఎన్నికల ముందే చెప్పారు. సీఎం క్యాంప్ ఆఫీసు విషయంలోనూ స్పష్టత ఇచ్చారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో నిర్మాణం చేస్తామన్నారు. మొన్నటి వరకు క్యాంపు ఆఫీసుగా ఉన్న ప్రగతి భవన్‌ పేరును మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా మార్చి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కేటాయించారు. ప్రజాభవన్ ప్రాంగణంలోని మరో బిల్డింగ్‌ను మరో మంత్రికి ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయలేదని.. కేవలం 12-14 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేశారని చెప్పారు రేవంత్ రెడ్డి. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే 24 గంటల విద్యుత్ ఇచ్చారని చెప్పారు. అన్ని అంశాలపై, అందరితో చర్చించి త్వరలోనే శ్వేత పత్రాలు విడుదల చేస్తామన్నారు.

First Published:  14 Dec 2023 11:34 AM GMT
Next Story