Telugu Global
Telangana

నిజామాబాద్‌లో కేసీఆర్ సభ.. ఇవ్వాళ ఆయన ఏం మాట్లాడబోతున్నారు?

నిజామాబాద్ కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు, కలెక్టరేట్ భవనాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

నిజామాబాద్‌లో కేసీఆర్ సభ.. ఇవ్వాళ ఆయన ఏం మాట్లాడబోతున్నారు?
X

తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొత్త కలెక్టరేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం పేరుతో పలు జిల్లాలకు వెళ్తున్నా.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాత్రం కేంద్రంలోని బీజేపీ టార్గెట్‌గా ప్రసంగాలు చేస్తున్నారు. వికారాబాద్ సభతో ప్రారంభించిన ఈ విమర్శల దాడి ఆ తర్వాత జరిగిన మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో బీజేపీనే లక్ష్యంగా చేసుకున్నారు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నించడాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించారు.

మరోవైపు రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదని.. మన దగ్గర నుంచి పన్నుల రూపేణా భారీగా తీసుకుంటున్నా, వాటిలో వాటాను మాత్రం సరిగా ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. గత వారాంతంలో కేసీఆర్ కీలకమైన భేటీలు నిర్వహించారు. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌తో పాటు మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలను ఈడీ, సీబీఐ దాడుల గురించి హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తోంది.. కావునా, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

తాజాగా, బీజేపీ ఎలా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈడీ, సీబీఐని ప్రత్యర్థి పార్టీలపై ఉసిగొల్పుతున్నదో ప్రజలకు వివరించాల‌ని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు, కలెక్టరేట్ భవనాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సోమవారం సభలో కేసీఆర్.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదో ప్రజలకు వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. అనవసరమైన దాడులు చేయించి టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం కేంద్రం చేసే అవకాశం ఉన్నదని, అందుకే ప్రజలను ఈ విషయంలో అప్రమత్తం చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

కాగా, ఇటీవల కాలంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట కవిత పేరును బీజేపీ నాయకులు ఓ స్కాంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మీడియా మీట్లోనే కాకుండా ఓ ప్రముఖ ఛానల్‌లో కూడా ఆమె ఈ విషయంలో తన పాత్ర లేదని వివరించే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడ కవిత ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్ వెళ్తున్నారు. ఆమెను సీబీఐ టార్గెట్ చేయడంతో.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తున్నది. మరి కవిత పేరు నేరుగా తీసి వ్యాఖ్యానిస్తారా? లేదంటా ఆ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ఎలా వాడుకుంటుందో అని మాత్రమే వివరిస్తారా అనేది తెలియాలంటే కొన్ని గంటల వేచి చూడాల్సిందే.

First Published:  5 Sep 2022 1:59 AM GMT
Next Story