Telugu Global
Telangana

రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. ఎందుకంటే..?

ఇటీవలే మహారాష్ట్రలో బీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీని నియమించారు. వంశీధర్ రావును మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జిగా ప్రకటించారు. ఈ నియామకాల అనంతరం తొలిసారి మహారాష్ట్రకు వెళ్తున్న సీఎం కేసీఆర్.. రేపు సాంగ్లీ జిల్లాలో స్థానిక బీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతారు.

రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. ఎందుకంటే..?
X

తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(ఆగస్ట్-1) మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11.15 గంటలకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సాంగ్లీ జిల్లా వాటేగావ్‌ తాలూకా కేంద్రానికి రోడ్డుమార్గాన వెళ్తారు సీఎం కేసీఆర్. దళిత నేత అన్నా భావ్‌ సాఠే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 12.45 గంటలకు అన్నభావ్ సాఠే విగ్రహానికి నివాళులర్పించి మధ్యాహ్నం 1 గంటకు సాఠే వారసుల ఇంటికి వెళ్తారు. వారితో మాట్లాడి అనంతరం 1.30 గంటలకు ఇస్లాంపూర్ లోని రఘునాధ్ దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేస్తారు. సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనలో తెలంగాణలోని మాంగ్‌ సమాజ్‌ ప్రజలు పాల్గొనాలని మాంగ్‌ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షులు గైక్వాడ్‌ తులసీదాస్‌ పిలుపునిచ్చారు.

ఎవరీ అన్నా భావ్ సాఠే..?

మహారాష్ట్ర యుగ కవిగా, దళిత సాహిత్య చరిత్ర ఆద్యుడిగా అన్నాభావ్‌ సాఠే పేరొందారు. 1920 ఆగస్ట్-1న వాటేగావ్‌లో జన్మించిన సాఠే.. అంబేద్కర్‌ స్ఫూర్తితో దళిత ఉద్యమంలో చేరారు. అంబేద్కర్‌ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా అనేక రచనలు చేశారు. మహారాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

సాంగ్లీ జిల్లాలో రాజకీయ సమావేశం..

ఇటీవలే మహారాష్ట్రలో బీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీని నియమించారు. వంశీధర్ రావును మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జిగా ప్రకటించారు. ఈ నియామకాల అనంతరం తొలిసారి మహారాష్ట్రకు వెళ్తున్న సీఎం కేసీఆర్.. రేపు సాంగ్లీ జిల్లాలో స్థానిక బీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం కొల్హాపూర్‌ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. కొల్హాపూర్‌ లో దేవీ అంబాబాయి దర్శనం అనంతరం హైదరాబాద్‌ కి తిరుగు పయనం అవుతారు.

First Published:  31 July 2023 1:16 PM GMT
Next Story