Telugu Global
Telangana

గాంధీని కించపరిచే వెకిలి, మకిలి ప్రయత్నాలు మానుకోండి..

మంచికి ఏనాడూ విలువ తగ్గదని, మహాత్ముడు ఎన్నడూ మహాత్ముడిగానే ఉంటాడని, ఎవరో కొందరు చిల్లరమల్లర ఆలోచనలతో చేసే ప్రయత్నాలు నెరవేరవని అన్నారు కేసీఆర్. మహాత్ముడి దేశంగానే భారత దేశం ఎప్పటికీ ఉంటుందని అన్నారు.

గాంధీని కించపరిచే వెకిలి, మకిలి ప్రయత్నాలు మానుకోండి..
X

ప్రపంచంలో ఏ జాతీ.. తన చరిత్రను తానే మలినం చేసుకోదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అలాంటి వెకిలి, మకిలి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా ముక్తకంఠంతో అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో జరిగిన స్వాతంత్ర వజ్రోత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఏ దేశం స్థిరపడాలన్నా.. అనేక రకాల ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఎదురవుతాయని, దేశానికి సమగ్రత, స్వరూపం రావాలంటే చాలా సమయం పడుతుందని చెప్పారు. స్వాతంత్ర వజ్రోత్సవ వేళ, మహాత్ముడి కీర్తిని విశ్వవాప్తమయ్యేలా ప్రయత్నం చేయాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

మంచికి ఏనాడూ విలువ తగ్గదని, మహాత్ముడు ఎన్నడూ మహాత్ముడిగానే ఉంటాడని, ఎవరో కొందరు చిల్లరమల్లర ఆలోచనలతో చేసే ప్రయత్నాలు నెరవేరవని అన్నారు కేసీఆర్. మహాత్ముడి దేశంగానే భారత దేశం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. బయటి దేశాలకు వెళ్తే.. ఐ ఆమ్‌ ఫ్రమ్ ఇండియా అని చెప్పుకుంటామని, అప్పుడు అవతలి నుంచి.. `హో.. యువార్‌ ఫ్రం గాంధీస్‌ కంట్రీ.. ద గ్రేట్స్‌ మాన్స్‌ కంట్రీ..` అని సమాధానం వస్తుందని అన్నారు. అలాంటి సమాధానం విన్నప్పుడు మనం గర్వపడతామని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ మహాత్ముడి గొప్పతనాన్ని గుర్తించినా.. విశ్వమానవుడిగా పిలుచుకునే మహాత్ముడిని కించపరిచే దురదృష్టకర సంఘటనలు భారత్ లో జరగడం దారుణం అని అన్నారాయన.

ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ, గాంధీ మహాత్ముడికి ఘనమైన నివాళులు అర్పించడంలేదని పరోక్షంగా తన ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. అదే సమయంలో గాంధీ గొప్పదనాన్ని తగ్గించి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. స్వాతంత్రం వచ్చే నాటికి విడివిడిగా ఉంటున్న 584 సంస్థానాలను మహాత్మా గాంధీ వంటి పెద్దలు విలీనం చేశారని గుర్తుచేశారు.

దేశంలో పేదరికం ఉన్నంత కాలం, ఆక్రందనలు, అలజడులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు కేసీఆర్. పేదరికాన్ని నిర్మూలిస్తేనే మన సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుందని అన్నారు. ప్రజల ఆపేక్షలు అనుకున్న స్థాయికి చేరడంలేదని చెప్పారు. 1947లో స్వాతంత్య్రం రాక ముందే తెలంగాణ గడ్డపై కమ్యూనిస్ట్‌ పార్టీ ఆధ్వర్యంలో జాగీర్దార్‌ వ్యతిరేక పోరాటం జరిగిందని గుర్తుచేశారు కేసీఆర్. ఆ తర్వాత నక్సలిజం పోరాటాలు కూడా వచ్చాయని, వాటన్నింటినీ అధిగమించాలంటే.. ఇరుకైన సంకుచితమైన భావాలు పక్కనపెట్టి విశాల దృక్పథంతో, విశాలమైన ఆలోచనతో పనిచేయాలన్నారు. స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన యోధులందరికీ జోహార్లు అర్పించారు కేసీఆర్. వజ్రోత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు.

First Published:  8 Aug 2022 1:52 PM GMT
Next Story