Telugu Global
Telangana

జాతీయ రాజకీయానికి స్క్రీన్ ప్లే పూర్తి !

కేసీఆర్ ఏమి చెప్పినా అది సూటిగా జనాన్ని, రాజకీయ రంగాన్ని తాకుతుంది. చాలా మంది రాజకీయ నాయకులకు, పండితులకూ కేసీఆర్ కు ఉన్న తేడా అదే ! బీజేపీ తన ప్రధాన ప్రత్యర్థి అని శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించి యుద్ధ సన్నాహాల్లో మునిగిపోవడం కేసీఆర్ కు సాధ్యమయ్యింది.

జాతీయ రాజకీయానికి స్క్రీన్ ప్లే పూర్తి !
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలు కొత్త కాదన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు. జాతీయ రాజకీయాలు ఆయనకు ఎందుకు? తెలంగాణలో పరిస్థితి దిగజారుతోంది, ఢిల్లీ రాజకీయం అవసరమా? దక్షిణాది నాయకునికి ఉత్తరాదిన ఆదరణ లభిస్తుందా? ఉత్తరాది రాజకీయ కార్యకర్తలు, నాయకులు ఆమోదించగలరా? ఇట్లా అనేక ప్రశ్నలు, అనుమానాలు ప్రధాన స్రవంతి మీడియాలో, సోషల్ మీడియాలోనూ వెల్లువెత్తుతున్నాయి. అచ్చం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వేళ లక్షలాది సందేహాలు చుట్టుముట్టినట్లే!

ఆ కాలంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన డిమాండ్‌ వేడిని జాతీయ రాజకీయాల్లో రగిలించకపోతే, ఢిల్లీలో నిప్పు రాజెయ్యకపోతే లాబీయింగ్ కు ఫలితం దక్కదని కేసీఆర్ గుర్తించినందువల్లనే జాతీయ రాజకీయ పార్టీలను, శక్తులు, వ్యక్తులను ఒక్కతాటి మీదకు తీసుకు రావడానికి గట్టిగా ప్రయత్నించారు. సక్సెస్ కాగలిగారు. ప్రస్తుతం అదే ఫార్ములాను కేసీఆర్ అనుసరిస్తున్నారు. రాజకీయాల్లో విజయవంతం కావాలంటే తప్పనిసరిగా ఒక ప్రాతిపదిక, భావోద్వేగాలు, బలమైన వ్యూహం, సరైన సమయంలో సరైన ఎత్తుగడ వేయడం, తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోగలిగిన నేర్పరితనం, నైపుణ్యం, చాణక్యం, రణతంత్రపుటెత్తులు వేయగలగాలి. అవన్నీ కేసీఆర్ లో పుష్కలంగా ఉన్నవి. తన బలమూ, బలహీనతల గురించి ఆయనకు క్షుణ్ణంగా అవగాహన ఉంది.

ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపిన సమయం నుంచి హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ఓటమి పాలుకావడం, బీజేపీ వివిధ జిల్లాల్లో క్రమంగా పుంజుకోవడం వంటి పరిణామాలన్నీ కేసీఆర్ కు ముందే తెలుసు. ఏ సమయంలో ఎవరిని ప్రత్యర్థిగా 'సెలెక్టు' చేసుకోవాలో, ఎవరిని మిత్రునిగా ఎంపిక చేసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. 2004 లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేసీఆర్ పోటీ చేశారు. గులాంనబీ ఆజాద్‌తో కలిసి ప్రచారం చేశారు. ఆ సమయంలో తెలంగాణకు ప్రధాన శత్రువుగా చంద్రబాబు ఉన్నారు. కనుక కాంగ్రెస్ తో జతకట్టడం ఆనాటికి అది సరైన వ్యూహం. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో టిఆర్ఎస్ భాగస్వామిగా కూడా కొంత కాలం పనిచేసింది. తర్వాత విభేదించి వెలుపలికి వచ్చేసింది.

2001 నుంచి ఉప్పూ - నిప్పూలా ఉండిన చంద్రబాబుతో 2009 లో చేతులు కలపడం చారిత్రక ఘట్టం. 'తెలంగాణ ఏర్పాటు'ను అడుగడుగునా ఢిల్లీలోని తన పలుకుబడితో వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకుంటున్నందున, కాంగ్రెస్ హైకమాండ్ ను ఆయన ప్రభావితం చేస్తున్నందున వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని శత్రువుగా కేసీఆర్ గుర్తించి ఆయనతో తలపడ్డారు. కేసీఆర్ రాజకీయ వాతావరణాన్ని సులభంగా అంచనా వేయగలరు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన రణనీతి ఇందుకు అద్దం పడుతోంది. అవసరమైన సందర్భాలలో మొత్తం తెలంగాణకు శత్రువుగా చూపించి రాజకీయ 'పునరేకీరణ'కు ప్రయత్నించడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎట్లా టార్గెట్ చేస్తున్నదో, ఎట్లా రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నదో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ప్రధాని మోదీపై కేసీఆర్ దాదాపు ఏడాది కాలంగా నేరుగా పోరాడుతున్నారు. 2018 నుంచే ఆయన ఒక ప్రణాళికతోనే ముందుకు వెడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అంతకు ముందు సమర్థించిన, సహకరించిన కేసీఆర్ అంతకన్నా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు కోరుకుంటే.. అవసరమైతే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలోనూ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రజల నుంచి ఆశీస్సులు కోరారు. నారాయణపేట, వికారాబాద్, పెద్దపల్లి.. తదితర అనేక ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో ఇప్పటికే ప్రజల నుంచి ఇందుకు 'మద్దతు'కూడగట్టారు.

కాగా, ఆయన వేస్తున్న నిచ్చెన చాలా పెద్దది కావచ్చు, కానీ కొడితే కుంభస్థలమే కొట్టాలన్న కసి కేసీఆర్ లో కనిపిస్తోంది. కేసీఆర్ ఏమి చెప్పినా అది సూటిగా జనాన్ని, రాజకీయ రంగాన్ని తాకుతుంది. చాలా మంది రాజకీయ నాయకులకు, పండితులకూ కేసీఆర్ కు ఉన్న తేడా అదే ! బీజేపీ తన ప్రధాన ప్రత్యర్థి అని శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించి యుద్ధ సన్నాహాల్లో మునిగిపోవడం కేసీఆర్ కు సాధ్యమయ్యింది. మిగతా నాయకుల్లో ఈ ధోరణి కనిపించదు. మాటల్లో అస్పష్టత, భావ ప్రకటనలో గందరగోళం కనిపిస్తుంటాయి. తెలంగాణ అభివృద్ధి నిరోధకునిగా, ప్రగతికి అడ్డంకిగా, ప్రజల పాలిట విలన్ గా మోదీని నిలబెట్టగలుగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ఢీ అండే ఢీ అని కేసీఆర్ అంటున్నారు. మోడీ, అమిత్ షా ఎత్తుకు పైఎత్తు వేయగలిగే నైపుణ్యం తనకున్నట్టు తెలంగాణ సీఎం నమ్ముతున్నారు.

ఇక కాంగ్రెస్ తో యాభై ఏళ్ల అనుబంధాన్ని తెంచేసుకున్న గులాం నబీ ఆజాద్ తో కేసీఆర్ టచ్ లో ఉన్నారు. పలువురు మేధావులు, వివిధ రంగాల నిష్ణాతులతోనూ కేసీఅర్ సంభాషిస్తూ ఉన్నారు. మతోన్మాద భావజాలానికి కౌంటర్ భావజాలాన్ని ఆయన నిర్విరామంగా రచిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్న అంశమే కేసీఆర్ ' ప్రత్యామ్నాయ ' అజెండా రూపకల్పనకు ఉపయోగపడుతుంది. గడచిన ఎనిమిదేండ్లలో విద్యుత్తు, ఇరిగేషన్ రంగాలతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలులో సాధించిన విజయాలు కేసీఆర్ సొంతం. కాంగ్రేస్‌, బీజేపీయేతర జాతీయ రాజకీయాల నిర్మాణానికి అవి పునాదులను ఏర్పరుచుతున్నవి.

First Published:  1 Sep 2022 2:30 AM GMT
Next Story