Telugu Global
Telangana

బీజేపీని గద్దె దించే రైతు ప్రభుత్వం రాబోతుంది

60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అదే ఆత్మగౌరవంతో ఉందామా? మళ్లీ ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లకు సద్ది కట్టి గులాములు అవుదామా ఆలోచించండి అని సీఎం కేసీఆర్ అన్నారు.

బీజేపీని గద్దె దించే రైతు ప్రభుత్వం రాబోతుంది
X

దేశాన్ని గజదొంగలు దోచుకుంటున్నారు

తెలంగాణలో నీళ్లు పారాలా? నెత్తురు పారాలా?

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలను భగ్నం చేయాలి

పెద్దపల్లి సభలో సీఎం కేసీఆర్

ప్రధాని మోడీ చెప్పేవన్నీ అబద్దాలేనని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే రైతు ప్రభుత్వం రాబోతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కొత్త కలెక్టరేట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో రైతుల సాగుకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు వాడేది కేవలం 20.8 శాతం విద్యుత్ మాత్రమే. ఇందుకు రూ. 1,45,000 కోట్ల వ్యయం అవుతుంది. ఇది మోడీ ప్రభుత్వం కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టినంత సొమ్ము కూడా కాదని చెప్పారు. కానీ రైతు బంధు డబ్బులు ఇస్తుంటే ఉచితాలు ఎందుకు ఇస్తున్నారని అంటోంది. ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం బలవంతం చేస్తోందని కేసీఆర్ అన్నారు.

నిన్న, మొన్న 25 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులతో సమావేశం అయ్యాను. వారందరూ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. కేంద్రంలో రైతు ప్రభుత్వం వస్తే.. మీటర్లు లేని విద్యుత్ సరఫరా అవుతుంది. ఎన్‌పీఏల పేరుతో కార్పొరేట్లకు రూ. 12 లక్షల కోట్లు దోచి పెట్టారు. కానీ రైతులకు మాత్రం రూ. 1 లక్ష కోట్లు ఇవ్వడానికి కేంద్రం వెనుకాడుతోందని కేసీఆర్ ఆరోపించారు. రైతులకు మంచి చేయడానికి కేంద్రానికి చేతులు రావడం లేదని అన్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేసింది, బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోంది. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం.. చనిపోయిన వ్య‌క్తిని తగలబెడదాం అంటే కూడా జీఎస్టీ.. పాల మీద జీఎస్టీ వేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. పేద ప్రజల ఉసురు పోసుకుంటూ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి.

దొంగల బూట్లు మోసే సన్నాసులు కనపడుతున్నారు..

గాంధీ పుట్టిన గుజరాత్ రాష్ట్రంలో, ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రంలో మద్యనిషేధం చేశామని చెప్తున్నారు. కానీ అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతోంది. ఆ రాష్ట్రంలో 79 మంది కల్తీ మద్యానికి బలయ్యారు. దీనికి మీ సమాధానం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. గుజరాత్‌లో 24 గంటల కరెంటు రాదు, 2వేల రూపాయల పెన్షన్ రాదు, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ఉండదు.. అక్కడ దోపిడీ తప్ప ఏమీ ఉండదని ఆయన ఆరోపించారు. అక్కడి నుంచి వచ్చే గులాం గాళ్లు, ఈ దేశాన్ని దోచే దోపిడీ దొంగలు తెలంగాణకు వస్తే.. ఆ దోపిడీ దొంగల బూట్లు మోసే సన్నాసిగాళ్లు మనకు ఇక్కడ కనపడుతున్నారంటూ పరోక్షంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను విమర్శించారు.

60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అదే ఆత్మగౌరవంతో ఉందామా? మళ్లీ ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లకు సద్ది కట్టి గులాములు అవుదామా ఆలోచించండి అని అన్నారు. ప్రధాని మోడీకి ఏమైనా తెలివి తేటలు ఉన్నాయా.. బియ్యం కొనడు, ధాన్యం కొనడు. ఇవ్వాళ అంతర్జాతీయ మార్కెట్‌లో నూకలకు కూడా షార్టేజీ వచ్చింది. గోధుమలు కూడా కొనకపోవడంతో ఇవ్వాళ‌ వాటిని మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ముందు చూపు లేక, పిచ్చి పిచ్చి విధానాలతో.. దేశ ఆర్థిక పరిస్థితిని నాశనం చేసి.. రూపాయి విలువ దిగజార్చి.. అంతర్జాతీయ సమాజంలో దేశ పరువును తీస్తున్నారని మోడీని విమర్శించారు.

నరేంద్ర మోడీ తీరు కారణంగా.. శ్రీలంకలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది అన్నారు. మోడీ గో బ్యాక్‌ అంటూ శ్రీలంక ప్రజలు కూడా నినాదాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పెద్దపల్లి నుంచే చెప్తున్నాను.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రాదు. ఈ గోల్ మాల్ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలే. బీజేపీ ప్రభుత్వాలు అన్నీ గద్దెదిగి.. రైతుప్రభుత్వాలు రాబోతున్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

సింగరేణి ప్రైవేటుపరం కానివ్వం..

తాను ఏనాడూ పెద్దపల్లి జిల్లా అవుతుందని ఊహించలేదని.. కానీ ఇవ్వాళ‌ జిల్లాను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. సింగరేణి కారణంగా ఇక్కడ ఎంతో మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సింగ‌రేణిలో వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి. దేశంలో ఎక్క‌డా ఇవ్వ‌ని విధంగా సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్ ఇస్తున్నాం. రామ‌గుండం ప‌ట్ట‌ణాన్ని కార్పొరేష‌న్ చేసుకున్నాం. ఏ విధ‌మైన కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయో మీకు తెలుసు అని కేసీఆర్ తెలిపారు. పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఉన్న సింగరేణి కార్మికులు పిడికిలి ఎత్తి కన్నెర్ర చేయాలని అన్నారు. సింగరేణి గనులను కూడా ప్రైవేటు పరం చేసి..,. షావుకార్లకు అప్పగించడానికి ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అందరం కలసి ప్రతినబూని 2024లో బీజేపీ ముక్త్ భారత్ చేస్తేనే దేశాన్ని కాపాడుకోగలం అని అన్నారు.

మేధావులు, బుద్దిజీవులు, యువకులు నిద్రాణమై ఉండకుండా.. ప్రతీ ఒక్కరిని చైతన్యవంతులను చేయాలి. శ్రీరాంసాగర్ కాలువల్లో మంచినీళ్లు పారాల్నా.. మత ఘర్షణల మంటల కారణంగా నెత్తురు పారాల్నా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దుర్మర్గులు, మత పిచ్చిగాళ్లు, ఉన్మాదుల బారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం అని కేసీఆర్ అన్నారు. రామగుండంలో, తెలంగాణలోని ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరమైనా అనుకున్నామా అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో భగీరథ పథకం వచ్చి మంచినీటి బాధ తీరుతుందని ఊహించామా? కానీ మనం అవన్నీ చేసుకున్నాము. గుజరాత్‌లో ఇవన్నీ లేవు. కానీ అక్కడి నుంచి వచ్చి.. మా బూట్లు, చెప్పులు మోయమనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకు బుద్ది చెప్పాలని కేసీఆర్ అన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు విజ్ఞప్తి మేరకు 266 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికి రూ. 10 లక్షలు, రామగుండం కార్పొరేషన్‌తో పాటు.. మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ. 1 కోటి చొప్పున మంజూరు చేస్తున్నానని.. రేపే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని కేసీఆర్ ప్రకటించారు. అంతకు ముందు పెద్దపల్లిలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టర్ సంగీత సత్యనారాయణను ఆయన ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

First Published:  29 Aug 2022 2:07 PM GMT
Next Story