Telugu Global
Telangana

ఒకే మహూర్తాన్ని ఓకే చేసిన కేసీఆర్, జగన్..

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్.. ఒకేరోజు మహూర్తాన్ని ఫిక్స్ చేశారు. అది కూడా ఒకేరకమైన కార్యక్రమం కోసం. ఇంతకీ ఏంటా కార్యక్రమం..? మీరే చదవండి..

ఒకే మహూర్తాన్ని ఓకే చేసిన కేసీఆర్, జగన్..
X

తెలంగాణలో రేపు (శుక్రవారం) 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి.

ఏపీలో కూడా రేపు (శుక్రవారం) 5 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారు.

అక్కడ సీఎం కేసీఆర్, ఇక్కడ సీఎం జగన్.. ఇద్దరూ ఈ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఇప్పటి వరకూ మెడికల్ కాలేజీల ఏర్పాటు పెద్ద ప్రహసనంగా ఉండేది, సీట్లు లేక, పోటీ ఎక్కువై విద్యార్థులు విదేశాలకు సైతం వెళ్లి చదువుకునేవారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ అవస్థను దూరం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్త కాలేజీలు రావడం తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ హయాంలోనే కావడం విశేషం.

కేసీఆర్‌ హయాంలో 21 మెడికల్‌ కాలేజీలు..

తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణలో 5 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. దశాబ్ద కాలంలోనే సీఎం కేసీఆర్ హయాంలో 21 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా 9 మెడికల్ కాలేజీలను ఒకేరోజు ప్రారంభిస్తున్నారు సీఎం కేసీఆర్. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామల్లో కొత్తగా ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర సొంత నిధులతో ఒకే ఏడాది ఇంత పెద్దసంఖ్యలో మెడికల్‌ కాలేజీలు ప్రారంభించడం దేశంలోనే ఇదే ప్రథమం. 2014లో తెలంగాణలో ఉన్న 5 మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 850 సీట్లు ఉండగా.. 2023 నాటికి 26 మెడికల్‌ కాలేజీలతో ఆ సీట్ల సంఖ్య 3,690కి చేరింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి ప్రతి ఏటా 10వేలమంది డాక్టర్లు తెలంగాణ నుంచి వస్తున్నారు.

ఇక ఏపీ విషయానికొస్తే.. సీఎం జగన్ రేపు 5 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్నారు. విజయనగరం మెడికల్‌ కాలేజీని నేరుగా ప్రారంభిస్తారు. అక్కడినుంచే రాజమండ్రి, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాల కాలేజీలను వర్చువల్‌ గా ప్రారంభిస్తారు. ఈమేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు జగన్. అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మెడికల్‌ కాలేజీ ప్రారంభించి, ల్యాబ్‌లు పరిశీలిస్తారు. అనంతరం అక్కడినుంచే మిగిలిన 4 మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌ గా ప్రారంభిస్తారు.

First Published:  14 Sep 2023 2:32 AM GMT
Next Story