Telugu Global
Telangana

నెలాఖరులోగా పోడుభూముల పంపిణీ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ

పోడు భూములు పంపిణీ చేశాక వారికి కూడా రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు.

నెలాఖరులోగా పోడుభూముల పంపిణీ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ
X

పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక విధానం ఉందని అన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. నెలాఖరులోగా పోడు భూముల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో 66 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయని, 11.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తామని చెప్పారు. పోడు పట్టాలు ఇచ్చాక కూడా ఆక్రమణలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

పట్టాలిచ్చాక రైతుబంధు..

పోడు భూములు పంపిణీ చేశాక వారికి కూడా రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకోబోమని చెప్పారు. గుత్తికోయలను తీసుకొచ్చి అడవులను నరికేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయొద్దని సూచించారు. అదే సమయంలో అధికారులపైనా గిరిజనులు దాడులు చేయడం సరికాదన్నారు. అలాంటి దాడులను సహించబోమని చెప్పారు. ఇకపై అటవీ ప్రాంతాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టనివ్వం అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.


పోడు, అటవీ భూములు కొందరికి ఆటవస్తువుల్లా తయారయ్యాయని అన్నారు కేసీఆర్. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని, కానీ కళ్ల ముందు ఉన్న అటవీ సంపదను కాపాడుకోలేకపోతున్నామని చెప్పారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసన్నారు కేసీఆర్. ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని.. పట్టాలు ఇచ్చాక గజం భూమిని సైతం ఆక్రమించబోమని ప్రభుత్వానికి లబ్ధిదారులు హామీ ఇవ్వాలన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తామని చెప్పారు.

First Published:  10 Feb 2023 7:36 AM GMT
Next Story