Telugu Global
Telangana

రీ పోలింగ్‌కు ఛాన్సే లేదు - వికాస్‌రాజ్‌

కౌంటింగ్ సెంటర్లలో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ 28 టేబుళ్లు ఉంటాయన్నారు.

రీ పోలింగ్‌కు ఛాన్సే లేదు - వికాస్‌రాజ్‌
X

తెలంగాణలో ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 70.79 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌. 2018తో పోలిస్తే దాదాపు 3 శాతం ఓటింగ్‌ తగ్గిందన్నారు. చాలా చోట్ల రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్ జరిగిందన్నారు. ఓట్‌ ఫ్రం హోం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగింది.

డిసెంబర్‌ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు వికాస్‌ రాజ్‌. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ స్థానంలోనూ రీపోలింగ్‌కు అవకాశం లేదని చెప్పారు. ఇప్పటి వరకూ అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం, అతి తక్కువగా హైదరాబాద్‌లో 46.56 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 16,005 మంది వృద్ధులు, 9,459 మంది దివ్యాంగులు హోం ఓటింగ్ ఉపయోగించుకున్నార‌ని, 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని స్పష్టం చేశారు.

కౌంటింగ్ సెంటర్ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందని చెప్పారు వికాస్‌రాజ్‌. మొత్తం 40 కంపెనీల భద్రత కల్పిస్తున్నామన్నారు. స్ట్రాంగ్ రూంల దగ్గర సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ సెంటర్లలో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ 28 టేబుళ్లు ఉంటాయన్నారు.

ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 8.30 గంట‌ల‌ నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుందన్నారు వికాస్‌రాజ్‌. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి గతం కంటే ఈసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. 2018లో 2,400 కేసులు ఉంటే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదయ్యాయి.

First Published:  1 Dec 2023 10:24 AM GMT
Next Story