Telugu Global
Telangana

పోలీసు శాఖలో కొత్తగా 3,966 పోస్టులు.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం

సామాజిక పరిస్థితులతో పాటు నేరాల తీరు కూడా మారుతున్న క్రమంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని కేబినెట్ భావిస్తోంది.

పోలీసు శాఖలో కొత్తగా 3,966 పోస్టులు.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం
X

పోలీసు శాఖలో కొత్తగా 3,966 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖను మరింత పటిష్టం చేసే చర్యలను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. శాంతిభద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీస్ శాఖ.. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా మార్పులు చేయనున్నారు.

సామాజిక పరిస్థితులతో పాటు నేరాల తీరు కూడా మారుతున్న క్రమంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని కేబినెట్ భావిస్తోంది. దీనికి అనుగుణంగా నేరాల అదుపునకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ.. కొత్త పోస్టులను భర్తీ చేయనున్నది. నార్కోటిక్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని కేబినెట్ అభిప్రాయపడింది.

డ్రగ్స్ సంబంధిత నేరాలను అరికట్టేందుకు ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఉన్నది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో కొత్తగా పలు కేటగిరీలలో 3,966 పోస్టులు భర్తీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక విశ్వనగరంగా పేరు తెచ్చుకుంటున్న హైదరాబాద్‌లో శాంతి భద్రతలను మరింతగా మెరుగుపరిచేందుకు, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలని కేబినెట్ అభిప్రాయపడింది. అందుకుగాను నగరం విస్తరించి ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కొత్తగా పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిల్స్, కొత్త డివిజన్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను హోం శాఖ చేపట్టనున్నది.

First Published:  10 Dec 2022 1:52 PM GMT
Next Story