Telugu Global
Telangana

ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు.. మూడు పార్టీల ఫోకస్.!

తెలంగాణ ఉద్యమంలో అప్పటి టీఆర్ఎస్‌, ఉద్యోగ సంఘాలు కలిసి పనిచేశాయి. ఉద్యోగ సంఘాలు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచి ఆందోళనలు చేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్న్‌మెంట్ అని ప్రకటించారు కేసీఆర్.

ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు.. మూడు పార్టీల ఫోకస్.!
X

ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు.. మూడు పార్టీల ఫోకస్.!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని దాదాపు 9.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌లను 73 శాతం పెంచామని బీఆర్ఎస్ వారి మద్దతు కోరుతోంది. అయితే జీతాలు చెల్లించడంలో విఫలమైన బీఆర్ఎస్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త పీఆర్సీ ఏర్పాటులో ఆలస్యం, సీపీఎస్ రద్దు చేయకపోవడం, ప్రతి నెలా 1వ‌ తేదీన జీతాలు ఇవ్వకపోవడం, పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను క్లియర్ చేయలేదన్న అంశాలను ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో అప్పటి టీఆర్ఎస్‌, ఉద్యోగ సంఘాలు కలిసి పనిచేశాయి. ఉద్యోగ సంఘాలు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచి ఆందోళనలు చేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్న్‌మెంట్ అని ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను ప్రకటించి.. గతంలో ఎన్నడూ లేని విధంగా 2015లో ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. 2021లో మళ్లీ 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు.

కాగా, ప్రతి నెలా జీతాలు, పింఛన్ల చెల్లింపులో ఆలస్యం, ప్రమోషన్లు, బదిలీల్లో జాప్యం, ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు సరైన హెల్త్ స్కీం లేకపోవడంతో ఉద్యోగులకు, బీఆర్ఎస్‌కు గ్యాప్ పెరిగింది. ఇక CPS పరిధిలో ఉన్న దాదాపు 2.2 లక్షల మంది OPSను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు.. 9 ఏళ్లుగా ప్రమోషన్లు, బదిలీలు రాలేదని ఆగ్రహంతో ఉన్నారు.

కొత్త పీఆర్‌సీ ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సరిగ్గా వారం రోజుల ముందు కొత్త పీఆర్సీ ప్రకటించారు కేసీఆర్. 5 శాతం ఐఆర్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉద్యోగ సంఘాల డిమాండ్ మేరకు ప్రభుత్వం ఐఆర్ పెంచలేకపోయింది. మేనిఫెస్టోలో తిరిగి OPSకు వెళ్లడంపై అధ్యయనం చేసేందుకు కమిటీని వేస్తామని ప్రకటించింది బీఆర్ఎస్.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. త్వరలో విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యలను పొందుపరుస్తామని రెండు పార్టీలు ఉద్యోగ సంఘాల మద్దతు కోరుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే OPS పునరుద్ధరించడం, కర్ణాటక ప్రభుత్వం త్వరలో పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌కు కొంత అనుకూలంగా మారింది.

ఇక ప్రస్తుతం ప్రతి నెలా 20వ తేదీ వరకు విడతల వారీగా జీతాలు అందుతున్నాయని..అలా కాకుండా 1వ‌ తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్, బీజేపీలు వాగ్ధానం చేస్తున్నాయి. వీటితో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్ సెటిల్మెంట్‌, మెడికల్ ఫీ రీయింబర్స్‌మెంట్ బిల్లులు కూడా భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. అధికారంలోకి వస్తే వీటిని యుద్ధ ప్రతిపాదికను పరిష్కరిస్తామని కాంగ్రెస్, బీజేపీ హామీ ఇస్తున్నాయి.

First Published:  25 Oct 2023 4:17 AM GMT
Next Story