Telugu Global
Telangana

ఆధ్యాత్మిక రాష్ట్రంగా తెలంగాణ..

తెలంగాణలో ఏర్పాటయిన బ్రాహ్మణ సదన్‌ దేశానికి ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.

ఆధ్యాత్మిక రాష్ట్రంగా తెలంగాణ..
X

ఆధ్యాత్మిక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్. దేవాలయాల జీర్ణోద్ధరణతో ధార్మిక కార్యక్రమాలు విస్తరిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వేదపండితులు ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్నారన్నారు. నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ, లోక క్షేమాన్ని కోరుకుంటూ, తమ జీవితాలను దేవుడి సేవకే అంకితం చేసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉందన్నారు కేసీఆర్. తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పలు పథకాల ద్వారా వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ఈనెల 31న తెలంగాణ బ్రాహ్మణ సదన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు.

హైదరాబాద్‌ లోని గోపన్‌ పల్లిలో 9 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ బ్రాహ్మణ సదన్‌ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈనెల 31 బ్రాహ్మణ సదన్ ని ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ని కలసి ఆహ్వానించారు బ్రాహ్మణ సంఘాల నాయకులు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు కేవీ రమణాచారి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సదన్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల వివరాలను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. చండీయాగం, సుదర్శనయాగంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులకు తగిన ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ వారికి సూచించారు.

దేశానికే ఆదర్శం..

తెలంగాణలో ఏర్పాటయిన బ్రాహ్మణ సదన్‌ దేశానికి ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి కూడా తెలంగాణకు ఉపాధి కోసం అర్చకులు, పురోహితులు, వేద పండితులు వలస వస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలతోపాటు బ్రాహ్మణులకూ తెలంగాణ ఉపాధి కేంద్రంగా మారిందని వివరించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బ్రాహ్మణ సమాజానికి భరోసా దొరికిందని అన్నారు.

First Published:  28 May 2023 1:46 AM GMT
Next Story