Telugu Global
Telangana

మోదీ కార్యక్రమానికి కేసీఆర్ ని బతిమిలాడుకుంటున్నారా..?

ఇప్పుడు మూడోసారి ప్రధాని తెలంగాణకు వస్తున్నారు. ఆల్రడీ సీఎం కేసీఆర్ కి ఆహ్వానం అందింది. కానీ ఆయన హాజరయ్యేలా లేరు. దీంతో బీజేపీకి తలకొట్టేసినట్టుగా ఉంది.

మోదీ కార్యక్రమానికి కేసీఆర్ ని బతిమిలాడుకుంటున్నారా..?
X

ఓవైపు ఏపీలో ప్రధాని మోదీకి సీఎం జగన్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అటు తమిళనాడులో కూడా ప్రధాని కార్యక్రమాలకు సీఎం స్టాలిన్ హాజరవుతుంటారు. ఆఖరికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానితో వేదిక పంచుకోడానికి పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ తెలంగాణ ఆత్మగౌరవం మాత్రం తగ్గేదే లేదంటోంది. ఆమధ్య మోదీ రెండుసార్లు అధికారిక కార్యక్రమాల పేరుతో తెలంగాణ వచ్చారు. కేసీఆర్ స్వాగతం పలకలేదు, ఆయనతో కలసి ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు మూడోసారి ప్రధాని వస్తున్నారు. ఆల్రడీ సీఎం కేసీఆర్ కి ఆహ్వానం అందింది. కానీ ఆయన హాజరయ్యేలా లేరు. దీంతో బీజేపీకి తలకొట్టేసినట్టుగా ఉంది. కేసీఆర్ రాకపోతే ప్రధాని సభను ఎవరూ పట్టించుకోరు. ఇప్పటికే రామగుండం కార్యక్రమంపై అయిపోయిన పనికి కొబ్బరికాయా అంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ దశలో కేసీఆర్ ని ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి రావాలని బతిమిలాడుకుంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.

ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్ రావాలంటూ రాష్ట్ర బీజేపీ తరపున కోరుకుంటున్నామని తెలిపారు బీజేపీ నేత లక్ష్మణ్. ఏపీలో ప్రధాని మోదీని పార్టీలకతీతంగా ఆహ్వానిస్తుంటే.. తెలంగాణలో మాత్రం స్వాగతించడం లేదని అన్నారు లక్ష్మణ్. కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకోవడం ఇది మూడోసారని, ఆయనకు ఇది సబబు కాదని అన్నారు లక్ష్మణ్. రాజకీయాలు వేరు.. ప్రభుత్వాలు వేరు అని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండి అభివృద్ధి చేయమని మోదీని అడగాలని కోరారు.

ఎందుకిదంతా..?

రామగుండంలో ప్రధాని ఏం చేస్తారు..? కేంద్ర పథకాలను పొగుడుతారు, అదే సమయంలో రాష్ట్రంనుంచి తమకు సహకారం అందడంలేదని అంటారు. అలాంటి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఎందుకెళ్లాలి. పోనీ అదేమైనా గొప్ప కార్యక్రమమా అంటే అదీ లేదు. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు తిరిగి ప్రారంభించడం ఎందుకు. ఏదో ఏపీకి వస్తున్నాం కదా, పనిలో పనిగా తెలంగాణలో ఆగి వెళ్లిపోదామనుకుని పెట్టుకున్న కార్యక్రమం అది. దాన్నే అభివృద్ధి అనుకోవాలంటే ఎలా..? ఇప్పటికే ఇలా విమర్శలు చుట్టుముట్టడంతో కేసీఆర్ హాజరైతే కనీసం ఆ అపవాదు తొలగిపోతుందని అనుకుంటున్నారు బీజేపీ నేతలు. అందుకే ఇలా బతిమిలాడుకుంటున్నారు. మూడోసారి కూడా మొహం చాటేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

First Published:  11 Nov 2022 9:41 AM GMT
Next Story