Telugu Global
Telangana

కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు.. టీబీజేపీకి బన్సల్ చికిత్స

మునుగోడు ఫలితాల తర్వాత బీజేపీ డీలా పడ్డ సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలనాటికి బీజేపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఇప్పుడవి పెరిగి పెద్దవయ్యాయి.

కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు.. టీబీజేపీకి బన్సల్ చికిత్స
X

గ్రూపు రాజకీయాలు, గొడవలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్ లో ఇలాంటివి సర్వ సాధారణం. కానీ ఈసారెందుకో టీకాంగ్రెస్ ఐక్యతా రాగం ఆలపిస్తోంది. ఖమ్మం సభలో కూడా అందరూ చెట్టపట్టాలేసుకుని నడిచారు. రాహుల్ గాంధీ వార్నింగ్ బాగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. రాగా పోగా బీజేపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వరుసగా రెండు ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలను గెలుచుకున్న బీజేపీ మునుగోడు ఫలితాల తర్వాత డీలా పడ్డ సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలనాటికి బీజేపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఇప్పుడవి పెరిగి పెద్దవయ్యాయి.

తెలంగాణ బీజేపీ నేతలు ఎవరికి వారే పెత్తనం కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. మరో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన స్థాయికి తగ్గ గుర్తింపు లేదనుకుంటున్నారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగినా చివరకు సర్దుబాటు చేసుకున్నారు. మూడో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవలే పెద్ద బాంబు పేల్చారు. అధిష్టానంపైనే రంకెలేశారు, తనకు గుర్తింపు లేదని చిందులు తొక్కారు. చివరకు నేనెక్కడన్నానంటూ సైలెంట్ అయ్యారు. మాటలు మార్చినా రఘునందన్ రావు పూర్తి అసంతృప్తితో ఉన్నారని మాత్రం స్పష్టమైంది. మధ్యలో జితేందర్ రెడ్డి లాంటి నేతలు పార్టీ వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతున్నారు.

చేరికలు సున్నా..

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లిని ఒడిసిపట్టడంలో బీజేపీ విఫలమైంది. అసంతృప్త నేతలందరికీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారింది. దీంతో బీజేపీకి పరోక్షంగా నష్టం జరుగుతోంది. దీనికితోడు అంతర్గత కుమ్ములాటలు ఆ గాయాన్ని మరింత పెద్దది చేస్తున్నాయి. ఈ దశలో రెండు రోజుల పర్యటనకోసం తెలంగాణకు వస్తున్నారు బీజేపీ తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్. ఆయన చికిత్స ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. అధ్యక్ష పదవి మార్పుతో, ఈటలకు కీలక పదవి, బండికి కేంద్ర మంత్రి పదవి అనేవి ఇంకా అధికారికం కాలేదు. బన్సల్ పర్యటన తర్వాత రఘునందన్ రావు వ్యవహారంపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

First Published:  4 July 2023 7:13 AM GMT
Next Story