Telugu Global
Telangana

స్పెల్లింగ్ లు నేర్చుకోండ్రా బాబూ..! బీజేపీ ట్వీట్లు.. నెటిజన్ల కౌంటర్లు

చీవాట్లు, ట్రోలింగ్ లు, విపరీతమైన కామెంట్ల తర్వాత బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే..?

స్పెల్లింగ్ లు నేర్చుకోండ్రా బాబూ..! బీజేపీ ట్వీట్లు.. నెటిజన్ల కౌంటర్లు
X

ఈ మధ్య ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. మోదీ సంగతి పక్కనపెడితే.. బీజేపీలో చాలామంది అరకొర చదువులతోనే బిల్డప్ ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. తన తండ్రి ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో టీచర్ గా పనిచేసేవాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పరువు తానే తీసుకున్నారు. ఇటీవల అంబేద్కర్ జయంతి రోజున 'గుళమెత్తి'న బండి నెట్టింట కామెడీ పీస్ గా మారారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ నేతల విషయపరిజ్ఞానం, భాషా పాండిత్యం.. అందరికీ తెలిసిందే. అయితే తాజాగా.. బీజేపీ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇలాంటి ఆణిముత్యం ఒకటి దొర్లింది. ఆ తప్పుని చూసి ట్విట్టర్ మోతెక్కిపోయింది. ముందు స్పెల్లింగ్ లు నేర్చుకోండ్రా బాబూ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండ్ ల్ నిర్వహించేవారు కూడా మోదీలాగా డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారా.. అంటూ కౌంటర్లు పడుతున్నాయి.

ఇంతకీ ఏంటా ట్వీట్..

చీవాట్లు, ట్రోలింగ్ లు, విపరీతమైన కామెంట్ల తర్వాత బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. కాంపెన్సేషన్ అనే స్పెల్లింగ్ ని తప్పుగా రాశారు. అదేమీ మరీ అంత కఠినమైన పదం కాదు, హైస్కూల్ లెవల్ లో ఏ పిల్లవాడయినా దాని స్పెల్లింగ్ ఇట్టే చెబుతాడు. కానీ, బీజేపీ అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో ఆ తప్పు దొర్లే సరికి నెటిజన్లంతా ఓ ఆట ఆడేసుకున్నారు. ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీంతో ట్వీట్ డిలీట్ చేసి సైలెంట్ గా ఉన్నారు బీజేపీ నేతలు.

ఇటీవల TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆ నష్టపరిహారానికి వచ్చిన తంటాయే ఇది. కాంపెన్సేషన్ స్పెల్లింగ్ సరిగా రాయకపోయే సరికి నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. అది కూడా మరో విషయంలో అయితే సరిపెట్టుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడే సందర్భంలో స్పెల్లింగ్ మిస్టేక్ పడే సరికి బీజేపీకే తలకొట్టేసినట్టయింది. వెంటనే ట్వీట్ డిలీట్ చేసి సైలెంట్ అయింది.

First Published:  15 April 2023 1:22 PM GMT
Next Story