Telugu Global
Telangana

తెలంగాణ దేశానికే అన్నం పెడుతోంది.. కాళేశ్వరంతో కరువు పోయింది : మంత్రి హరీశ్ రావు

గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కరువును తరిమి కొట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ దేశానికే అన్నం పెడుతోంది.. కాళేశ్వరంతో కరువు పోయింది : మంత్రి హరీశ్ రావు
X

ఒకప్పుడు కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణ.. ఇవ్వాళ దేశానికే అన్నం పెడుతోందని.. దక్షిణాదికి మన రాష్ట్రం ధాన్యాగారంగా ఎదిగిందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో భూమికి బరువయ్యే లాగా పంటలు పండుతున్నాయని తెలిపారు. సిద్ధిపేటలో ఫ్లై వోవర్ ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయన్నారు.

గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కరువును తరిమి కొట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇకపై తెలంగాణ ప్రాంతంలో కరువు అన్నదే ఉత్పన్నం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జలాల కారణంగా వేసవి కాలంలో కూడా చెరువులు, చెక్ డ్యాంలు నిండుగా కనిపిస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం వ్యవసాయం అంటే దండగ అనే ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు వ్యవసాయం అంటే పండుగలా మారిందని మంత్రి తెలిపారు. అప్పట్లో తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కున్న తెలంగాణలో.. ఇప్పుడు ఎటు చూసినా పచ్చని పొలాలు దర్శనం ఇస్తున్నాయని మంత్రి చెప్పారు. వరల్డ్ ఫుడ్ పార్క్‌లో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద రైస్ మిల్ నిర్మాణం జరుగబోతోందని మంత్రి స్పష్టం చేశారు.

ఇక సిద్ధిపేటలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్మించనున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పాలమాకుల గ్రామంలో శంభు దేవాలయ పునర్నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. బాలాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

First Published:  25 Feb 2023 3:18 AM GMT
Next Story