Telugu Global
Telangana

ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలి..

కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఎన్నో రాయితీలిచ్చామని గుర్తు చేశారు. అలాంటి రోజులు మళ్లీ వస్తాయన్నారు హరీష్ రావు.

ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలి..
X

ఆటో డ్రైవర్ల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పటాన్ చెరు ప్రాంతంలో ఆటో డ్రైవర్లతో మాట్లాడిన ఆయన.. వారి సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో కొట్లాడతామని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నెలకు రూ.10వేలు పరిహారం ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లు వీధిన పడ్డారని, వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు హరీష్ రావు.


ఆత్మహత్యలు వద్దు..

ఇటీవల తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఉపాధి లేక, ఈఎంఐలు కట్టలేక ఆటోలను తగలబెడుతున్న ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు నిర్ణయించింది. హరీష్ రావు నేరుగా ఆటో డ్రైవర్లతో మాట్లాడేందుకు వారి వద్దకే వెళ్లారు. వారి సమస్యలు విన్నారు. వారికోసం బీఆర్ఎస్ ఉందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఎన్నో రాయితీలిచ్చామని గుర్తు చేశారు. అలాంటి రోజులు మళ్లీ వస్తాయన్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. కుటుంబాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు హరీష్ రావు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత రవాణా వల్ల తెలంగాణలో ఆటో డ్రైవర్లకు ఉపాధి దెబ్బతిన్నది. చాలా చోట్ల మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. అత్యవసరం ఉన్నా కూడా బస్సులు వచ్చే వరకు వేచి చూస్తున్నారు. పోనీ పురుషులతో ఆటోలు కిక్కిరిసి పోతున్నాయా అంటే అదీ లేదు. బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరగడంతో ఆమేర ఆటోలకు గిరాకీ తగ్గింది. బ్యాంకు రుణాలు తీసుకుని ఆటోలు కొన్న వారు లబోదిబోమంటున్నారు. మరో పని చేయలేక, ఉన్న ఆటోకి ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.5 లక్షలమంది ఆటో డ్రైవర్లు ఇలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడే అవకాశముంది.

First Published:  4 Feb 2024 7:56 AM GMT
Next Story