Telugu Global
Telangana

చీమలు పెట్టిన పుట్టలో పాములు.. అసెంబ్లీలో రచ్చ

చీమలు పెట్టిన పుట్టలోకి వచ్చిన పాము అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్. భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ.. లాంటి చీమలు పెట్టుకున్న కాంగ్రెస్ పుట్టలో దూరిన పాము ఎవరో అందరికీ తెలుసంటూ సెటైర్లు పేల్చారు కేటీఆర్.

చీమలు పెట్టిన పుట్టలో పాములు.. అసెంబ్లీలో రచ్చ
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపై చర్చలో భాగంగా కేటీఆర్ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. కేటీఆర్ ప్రసంగం మధ్యలోనే మైకందుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నాన్ రిలయబుల్ ఇండియన్(ఎన్నారై) అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదన్నారు. సిరిసిల్లలో చీమలు పెట్టిన పుట్టలోకి ఆయన ఎంటరయ్యారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.


కేటీఆర్ కౌంటర్..

చీమలు పెట్టిన పుట్టలోకి వచ్చిన పాము అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్. అసలు చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఎవరంటూ కౌంటర్ ఇచ్చారు. భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ.. లాంటి చీమలు పెట్టుకున్న కాంగ్రెస్ పుట్టలో దూరిన పాము ఎవరో అందరికీ తెలుసంటూ సెటైర్లు పేల్చారు కేటీఆర్. ఇక ఎన్నారై అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఎన్నారైలకు టికెట్లు అమ్ముకుంది ఎవరని ప్రశ్నించారు. అసలు దేశంలో నాయకులే లేనట్టు విదేశాలనుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడాన్ని ఏమనాలని అడిగారు.

దామోదర వివరణపై కూడా..

దామోదర రాజనర్సింహ పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన మధ్యలో వివరణ ఇచ్చారు. అధిష్టానం ఏది చెబితే దాన్నే కాంగ్రెస్ నేతలు శిరసావహిస్తారని చెప్పారు. అయితే ఈ వివరణకు కూడా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తాను చెప్పేది కూడా అదేనని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు లేరని, హైకమాండ్ నామినేట్ చేసిన వ్యక్తి సీఎం కుర్చీలో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన భాష మారలేదని, హుందాతనం తెచ్చిపెట్టుకుంటే రాదని ఎద్దేవా చేశారు.

First Published:  16 Dec 2023 7:24 AM GMT
Next Story