Telugu Global
Telangana

డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈ సారి వ్యూహమేంటంటే..!

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రమే అడ్డుగా మారిందని, తెలంగాణకు రావల్సిన రూ. 40 వేల కోట్ల ఆదాయం తగ్గడానికి కేంద్రమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.

డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈ సారి వ్యూహమేంటంటే..!
X

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఐటీ, ఈడీ దాడులు, విచారణలు.. మంత్రుల టార్గెట్‌గా కేంద్రం కక్ష సాధింపు చర్యలు సాగిస్తున్న వేళ.. అసెంబ్లీ సమావేశాలు జరుగనుండటం ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రమే అడ్డుగా మారిందని, తెలంగాణకు రావల్సిన రూ. 40 వేల కోట్ల ఆదాయం తగ్గడానికి కేంద్రమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయాలను లెక్కలతో సహా అసెంబ్లీలోనే ఎండగట్టాలని, జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని కేసీఆర్ నిర్ణయించారు. వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో కేంద్రం అసమర్ధతను, లోపాలను ఎత్తి చూపాలని కేసీఆర్ అనుకుంటున్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పూర్తిగా వివరించాలని కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్రం కార్పొరేషన్ల ద్వారా పరిమితికి మించి అదనంగా అప్పులు చేసిందని.. వీటిని రాష్ట్ర అప్పులుగానే భావిస్తామని కేంద్రం చెప్తోంది. అందుకే అప్పులు తీసుకోకుండా ఆంక్షలు విధించింది. రాష్ట్రానికి కొత్త అప్పులు పుట్టకపోవడంతో సర్దుబాటు కష్టంగా మారింది. 2022-23 బడ్జెట్ అంచనాల్లో 30 శాతం అప్పు కూడా రాష్ట్రం తీసుకొని రాలేకపోయింది. దీనికి కేంద్ర వైఖరే కారణం. ధనిక రాష్ట్రమైన తెలంగాణకు అప్పులు చెల్లించే స్తోమత ఉన్నా.. కేంద్రం కారణంగా అప్పులు రావడం లేదు. నిధుల సమస్యతో అనేక పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ సమస్యను తప్పకుడా అసెంబ్లీలో ఎత్తిచూపనున్నారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నిక ఓటమితో ఆగ్రహంగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులను ఐటీ, ఈడీ పేరుతో ఇబ్బందులు పెడుతోంది. సీబీఐ అడుగుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో అది నేరుగా కేసులు పెట్టడం లేదు. లేకపోతే ఆ సంస్జతో కూడా టీఆర్ఎస్ మంత్రులు, నాయకులపై కేసులు పెట్టించేదనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి రాజకీయ అలజడుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది.

First Published:  24 Nov 2022 1:37 PM GMT
Next Story