Telugu Global
Telangana

చంద్రబాబు రిమాండ్ పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

50రోజులవుతున్నా చంద్రబాబుకి బెయిల్ రావడం లేదంటే అరెస్ట్ కక్షపూరితమేనని అర్థమవుతోందన్నారు స్పీకర్ పోచారం. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు రిమాండ్ పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
X

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో బీఆర్ఎస్ నేతలంతా దాదాపుగా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ వయసులో ఆయన్ను ఇబ్బంది పెట్టడం సరికాదని సానుభూతి చూపిస్తున్నారు. కనీసం ఆయన సీనియార్టీనయినా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. దక్షిణ భారత దేశంలోనే చంద్రబాబు సీనియర్ నాయకుడని అన్నారు. ఆయన అరెస్ట్ కక్షపూరిత చర్య అని విమర్శించారు.

నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో మరోసారి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు స్పీకర్ శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ వర్ని మండల కేంద్రంలో జరిగిన కమ్మవారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు పోచారం. బాన్సువాడలో కమ్మ సోదరుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పారాయన. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలోనే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు పోచారం.

50రోజులవుతున్నా చంద్రబాబుకి బెయిల్ రావడం లేదంటే అరెస్ట్ కక్షపూరితమేనని అర్థమవుతోందన్నారు స్పీకర్ పోచారం. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

First Published:  28 Oct 2023 10:56 AM GMT
Next Story