Telugu Global
Telangana

ధన్యవాదాలకే దడదడలాడిన అసెంబ్లీ.. ఇక ముందు ముందు

మాటల తూటాలే కాదు.. చివరకు మార్షల్స్ కూడా రంగప్రవేశం చేసేంత వరకు పరిస్థితులు వెళ్లాయి. ఓ దశలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ వెల్‌ లోకి వెళ్లారు. క్లారిఫికేషన్‌ కోసం అవకాశం ఇవ్వకపోవడంతో హరీష్ రావు సైతం స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసనన తెలిపారు.

ధన్యవాదాలకే దడదడలాడిన అసెంబ్లీ.. ఇక ముందు ముందు
X

తెలంగాణ ప్రజల తాజా తీర్పు తర్వాత అసెంబ్లీ సమావేశాలు శనివారం హాట్ హాట్ గా సాగాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎదురుదాడికి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు మొదలైన ప్రసంగాలు వాడివేడిగా సాగాయి. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ తన సుదీర్ఘ ప్రసంగంలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. మధ్యలో హరీష్ రావు కూడా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. అటు అధికార పక్షం నుంచి రేవంత్ రెడ్డి కూడా అంతే ధీటుగా మాట్లాడారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.

ఈనెల 20కు సభ వాయిదా.. అంటూ స్పీకర్ ప్రకటించే వరకు వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత పాలనలో తెలంగాణ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లైంది అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అధికార కాంగ్రెస్ కూడా గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టింది. గణాంకాలతో ప్రజల్ని మభ్యపెట్టలేరని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తోందని, రెండు గ్యారెంటీలు పూర్తయ్యాయంటున్నా.. అందులో పదోవంతు కూడా అమలు చేయలేదని విమర్శించారు కేటీఆర్. ప్రమాణ స్వీకారాల తర్వాత అసెంబ్లీ ప్రశాంతంగా సాగుతుందనుకున్న టైమ్ లో ధన్యవాదాల విషయంలోనే ఇంత గందరగోళం నెలకొంటే ఇక ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆందోళన, ఆసక్తి అందరిలోనూ ఉంది.

అప్పుడే మార్షల్స్..

మాటల తూటాలే కాదు.. చివరకు మార్షల్స్ కూడా రంగప్రవేశం చేసేంత వరకు పరిస్థితులు వెళ్లాయి. ఓ దశలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ వెల్‌ లోకి వెళ్లారు. క్లారిఫికేషన్‌ కోసం అవకాశం ఇవ్వకపోవడంతో హరీష్ రావు సైతం స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసనన తెలిపారు. ఈ సమయంలో మార్షల్స్‌ రంగ ప్రవేశం చేయటంతో సభలో వాతావరణం మరింత వేడెక్కింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జై తెలంగాణ.. సేవ్‌ డెమోక్రసీ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ మీడియా పాయింట్‌ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిరోజే ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్‌ చేసిందని విమర్శించారు.

First Published:  17 Dec 2023 2:08 AM GMT
Next Story