Telugu Global
Telangana

అసెంబ్లీ గేటు దాటితే ఆయన చైన్ స్మోకర్.. అప్పట్లో సభలో చిరుతిళ్లు

మంత్రి కొండా సురేఖ కూడా నాటి సంగతులను నెమరు వేసుకున్నారు. గతంలో సభా మర్యాదను అందరూ కాపాడేవారని గుర్తు చేశారు. మైసూరా రెడ్డి చైన్ స్మోకర్ అయినా కూడా.. ఆ అలవాటుని ఆయన సభ గేటు దగ్గరే వదిలిపెట్టేవారని చెప్పారు.

అసెంబ్లీ గేటు దాటితే ఆయన చైన్ స్మోకర్.. అప్పట్లో సభలో చిరుతిళ్లు
X

తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ సహా ఇతర నేతలు అభినందనలు తెలిపారు. స్పీకర్‌ పదవికి ప్రసాద్‌ కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తోపాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యే మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.




స్పీకర్ కి అభినందనలు తెలిపే క్రమంలో సభ్యుల ప్రసంగాలు ఆసక్తికరంగా సాగాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో సభ మరింత హుందాగా ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రసాద్ కుమార్ చేనేత శాఖ మంత్రిగా ఉన్నప్పటి విషయాలను గుర్తు చేశారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కూడా ఉందన్నారు. ఆనాడు మంత్రిగా ఉన్న ప్రసాద్ కుమార్ ను తాను సిరిసిల్ల తీసుకెళ్లి చేనేత కార్మికుల సమస్యలు వివరించానని చెప్పారు కేటీఆర్.

మంత్రి కొండా సురేఖ కూడా నాటి సంగతులను నెమరు వేసుకున్నారు. గతంలో సభా మర్యాదను అందరూ కాపాడేవారని గుర్తు చేశారు. మైసూరా రెడ్డి చైన్ స్మోకర్ అయినా కూడా.. ఆ అలవాటుని ఆయన సభ గేటు దగ్గరే వదిలిపెట్టేవారని చెప్పారు. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భార్య మాజీ మంత్రి రాజ్యలక్ష్మి అప్పట్లో తమకోసం చిరుతిళ్లు తీసుకొచ్చేవారని, వాటిని సభలోనే తినేవారమని చెప్పారు. అలా చిరుతిళ్లను సభలోకి తీసుకురావడం సభా మర్యాద కాదని మైసూరా రెడ్డి వారించారని, అప్పటినుంచి తాము మరింత హుందాగా ప్రవర్తించేవారమని చెప్పారు కొండా సురేఖ.

గతంలో తాము ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు తగిన సమయం ఇచ్చామని, ఇప్పుడు కూడా తమకు అలాగే అవకాశమివ్వాలని, పాలకపక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకు సమస్యల గురించి చర్చించేందుకు ఎక్కువ సమయం కావాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో సభ మరింత అర్థవంతంగా జరుగుతుందని ఆకాంక్షించారు.

స్పీకర్ ప్రసాద్ కుమార్ కి 8 మంది సోదరీమణులు ఉన్నారని, వారందర్నీ ఆయన అభిమానించేవారని, సోదరుడిగా వారి అవసరాలన్నీ తీర్చారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఒక మహిళగా తనకు ఆ విషయం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. కుటుంబ సభ్యులను ఎలా మంచిగా చూసుకున్నారో.. సభలో కూడా మహిళా సభ్యుల హక్కుల్ని స్పీకర్ కాపాడతారని ఆశిస్తున్నట్టు తెలిపారు పద్మావతి రెడ్డి.

First Published:  14 Dec 2023 6:45 AM GMT
Next Story