Telugu Global
Telangana

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

గవర్నర్‌ ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి ఆమెకు పంపించింది. అయితే ఆమె ఆ ప్రసంగానికి పరిమితం అవుతారా, లేక కొత్త విషయాలు చెబుతారా అనేది మరికాసేపట్లో తేలిపోతుంది.

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
X

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలాసార్లు బడ్జెట్ సమావేశాలు జరిగాయి, కానీ ఈ ఏడాది జరుగుతున్న సమావేశాలు చాలా ప్రత్యేకం. ఎన్నికల ఏడాదిలో వస్తున్న ఈ బడ్జెట్ మరింత వ్యూహాత్మకంగా ఉంటుందనే అంచనాలున్నాయి. టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి. దాదాపు రెండేళ్ల తర్వాత తెలంగాణ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించబోతున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సమావేశాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

మధ్యాహ్నం 12.10 గంటలకు మొదలు..

మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ, మండలిలో ఒకేసారి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్‌ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొదట్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా సమావేశాలను జరపాలని ప్రభుత్వం భావించింది. కానీ గవర్నర్ బడ్జెట్ కి ఆమోదం తెలపకపోవడం, ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు సూచనతో గవర్నర్ ని ప్రభుత్వం ఆహ్వానించడం.. ఇలా పలు పరిణామాల తర్వాత గవర్నర్ బడ్జెట్ ని ఆమోదించారు, ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.

గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుంది..?

గవర్నర్‌ ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి ఆమెకు పంపించింది. అయితే ఆమె ఆ ప్రసంగానికి పరిమితం అవుతారా, లేక కొత్త విషయాలు చెబుతారా అనేది మరికాసేపట్లో తేలిపోతుంది. ఇక కేంద్రానికి వ్యతిరేకంగా గవర్నర్ ప్రసంగంలో ఏవైనా అంశాలు ఉన్నాయా, ఉంటే వాటిని గవర్నర్ తొలగిస్తారా అనేది కూడా కాసేపట్లో తెలుస్తుంది. మొత్తమ్మీద బడ్జెట్ పై గవర్నర్ ప్రసంగంతో, ఆమె ప్రభుత్వంతో ఎలా ఉండబోతున్నారనే విషయంపై మరోసారి క్లారిటీ వస్తుంది.

రెండు వారాలు..

అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలను రెండు వారాల పాటు నిర్వహిస్తారని తెలుస్తుంది. ఈరోజు బడ్జెట్‌ పై గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశాలు నిర్వహిస్తారు. శనివారం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దీనిపై చర్చ జరుగుతుంది. ఈనెల 6వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం బడ్జెట్‌ ను ప్రవేశపెడుతుంది. అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ ప్రసంగాలు చేస్తారు. మంగళవారం సెలవు తర్వాత బుధవారం నుంచి యధావిధిగా బడ్జెట్ సెషన్ కొనసాగుతుంది. ఈసారి బడ్జెట్ 3లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ నెల 17న తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం ఉంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ముగ్గురు సీఎంలు, నలుగురు మాజీ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముందుగానే.. అంటే ఈనెల 16తో బడ్జెట్ సమావేశాలను ముగించాలనుకుంటోంది ప్రభుత్వం.

First Published:  3 Feb 2023 1:55 AM GMT
Next Story