Telugu Global
Telangana

బీజేపీలోకి చేరికల హడావుడి... పీరి లేవలేదు ఊదు ఆరలేదు!

తెలంగాణలో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని హడావుడి చేసిన రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పుడు చల్లబడ్డారట. వస్తామన్న వాళ్ళు చేయివ్వగా, కొత్తవాళ్ళెవ్వరూ టచ్ లోకి రాక ఏం చేయలో అర్దం కాని పరిస్థితిలో ఉన్నారట బీజేపీ నాయకులు

బీజేపీలోకి చేరికల హడావుడి... పీరి లేవలేదు ఊదు ఆరలేదు!
X

తెలంగాణలో ఆ మధ్య బీజేపీ పెద్దగానే హడావుడి చేసింది. అమిత్ షాలు , నడ్డాలు, నిర్మలా సీతారామన్లు, సింధియాలు...ఒకరేమిటి కేంద్ర నాయకులంతా తెలంగాణ పర్యటనల కోసం వరస కట్టారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వందల కొద్దీ టీఆరెస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి చేరుతున్నారంటూ, బండి సంజయ్ సహా స్థానిక నేతలంతా తెగ హడావుడి చేశారు.

ఇక కేంద్ర నాయకులు కూడా చేసిన హడావుడి తక్కువేం కాదు. ఇక టీఆరెస్ ప్రభుత్వం పడిపోయినట్టే అనేంత బిల్డప్ ఇచ్చారు. ఇక వచ్చేది తమ ప్రభుత్వమే అని, ముఖ్యమంత్రి ఎవరుండాలన్న చర్చల దాకా వెళ్ళారు. కానీ బీజేపీ లో చేరింది. రాజగోపాల్ రెడ్డి కాక ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బొమ్మ శ్రీరామ్‌, రాజయ్య యాదవ్‌తోపాటు కొందరు రిటైర్డ్‌ అధికారులు మాత్రమే.

మరి కొద్ది రోజుల్లో చూసుకోండి ఏం జరుగుతుందో అంటూ బండి సంజయ్ తొడలు కొట్టడం కార్యకర్తలు విజిల్స్ వేయడం తప్ప పీరి లేవలేదు ఊదు ఆరలేదు.

చేరికలపై ఎవరైనా ప్రశ్ని స్తే.. బీజేపీ నాయకులు చెప్పే మాట... సీక్రెట్‌ ఆపరేషన్‌ జరుగుతోం దని.. త్వ రలోనే ఆ ఆపరేషన్‌ ప్రభావం చూస్తారని చెబుతున్నా రు. రోజులు గడిచిపోతున్నా యి కానీ... ఆ సీక్రేట్ ఆపరేషన్ ప్రభావం మాత్రం కనబడటం లేదు. చేరికలు లేవు..మధ్య మధ్య లో అదిగో వాళ్ళు చేరుతున్నారు...ఇదిగో వీళ్ళిక వచ్చేసినట్టే అని పలువురి పేర్లు ప్రచారం చేస్తున్నప్పటికీకీ.. బీజేపీ కార్యాలయం వైపు చూసే కొత్త‌వాళ్ళెవరూ కనబడటం లేదు.

చేరికల కోసం ప్రత్యేకంగా ముందు ఇంద్రసేనా రెడ్డి నాయకత్వంలో , ఆ తర్వాత ఈటల రాజేందర్ నాయకత్వంలో కమిటీలు వేసినా ఆ కమిటీలు ఏం చేస్తున్నాయో వారికే తెలియదని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు.

ఒక వైపు చేరికల కోసం రాష్ట్ర‌ నాయకులపై అమిత్ షా ఒత్తిడి తీవ్రంగా ఉందట. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు, ఫోన్లో మాట్లాడినప్పుడు కొత్త నాయకులు ఎవరు చేరుతున్నారన్న మాటే మొదట అడుగుతున్నారట. పార్టీలో చేరే వాళ్ళకు వాళ్ళ తాహతును బట్టి పదవులు, కాంట్రాక్టులు...మరేదైనా వాళ్ళ ప్రత్యేక డిమాండ్లు ఉంటే అవన్నింటినీ తీరుద్దామని, అవసరమైతే ఈడీ, సీబీఐలు కూడా ఉన్నాయని పై నుంచి ఎన్ని విధాల చెప్పినా ఇక్కడ పార్టీలో చేర్చ‌డానికి ఎవ్వరూ దొరకడం లేదట. బీజేపీలోకి వస్తామని ముందుగా హామీ ఇచ్చిన కొంత మంది ఇతర పార్టీల నాయకులు ఎందుకో వెనక్కి తగ్గారని సమాచారం.

కనీసం మునుగోడులో అయినా ఎన్నికల్లో గెలవడం కోసం అక్కడ చేరికలను వేగవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అదికూడా పెద్దగా వర్కవుట్ కాలేదట. ఎవరో ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ పెద్దగా బీజేపీ వైపు రావడం లేదట. పైగా ఈ మధ్య మునుగోడుకు చెందిన పలువురు బీజేపీ ముఖ్యనేతలు టీఆరెస్ లో చేరారు.

ఇటీవల ఈటల‌ రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరి కొంత మంది బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేసి ఆ మండలంలో టీఆరెస్ లో ముఖ్యమైన నాయకుడు చుండూరు మండ‌లం దోనిపాముల స‌ర్పంచ్ తిప్ప‌ర్తి దేవేంద‌ర్ ను బీజేపీలో చేర్చారు. అనేక కష్టాలు పడి, ఎన్నో హామీలిచ్చి ఆయనను, ఆయన అనుచరులను బీజేపీలోకి తీసుకెళ్తే మర్నాడే ఆయన తన అనుచరులతో సహా మళ్ళీ టీఆరెస్ లో చేరిపోయారు. ఇది బీజేపీకి మింగుడు ప‌డటం లేదు. ఈ ప‌రిణామాలు కాషాయ ద‌ళాన్ని క‌ల‌వ‌రానికి గురి చేశాయి.

మరో వైపు సిద్దిపేట, దుబ్బాక తదితర నియోజక వర్గాల్లో కూడా బీజేపీ స్థానిక నాయకులు టీఆరెస్ లో చేరుతుండటం ఆ పార్టీ నాయకులకు కలవరపాటుకు గురి చేస్తోంది. ఒకవైపు వస్తారనుకున్న పెద్ద తలకాయలు వెనకడుగు వేయడం, మరో వైపు కింది స్థాయి నాయకులు జారిపోతూ ఉండటంతో ఏం చేయాలో బీజేపీ నాయకులకు దిక్కుతోచడం లేదట.

అయితే బైటికి మాత్రం బీజేపీ నాయకులు కొత్త ప్రచారం మొదలు పెట్టారు. ''మునుగోడు ఎన్నికలు అయిపోగానే టీఆరెస్, కాంగ్రెస్ ల నుంచి బీజేపీలో చేరడానికి చాలా మంది నాయకులు సిద్దంగా ఉన్నారు '' అని ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో గెలిస్తే వాళ్ళ మాట కొంత మేరకు నిజమవుతుందేమో కానీ ఓడిపోతే ప్రస్తుతం పార్టీలో ఉన్నవాళ్ళను కూడా ఆపగలరా ?

మరో వైపు రాష్ట్ర బీజేపిలో ఉన్న గ్రూపు కొట్లాటలు కూడా చేరికలపై ప్రభావం చూపిస్తున్నాయట. అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేరికల కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ల మధ్య వర్గ పోరు సీరియస్ గా ఉందట. అధిష్టానం ఎన్ని సార్లు క్లాసులు తీసుకున్నా ఈ గ్రూపులను మాత్రం ఏం చేయలేకపోతున్నదని కార్యకర్తలు వాపోతున్నారు. అధిష్టానం దగ్గర తమకే పట్టు ఉందని నిరూపించుకునేందుకు ఎవరికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు పార్టీని బలహీనపరుస్తున్నాయని కింది స్థాయి కార్యకర్తలు అంటున్నారు.

First Published:  1 Oct 2022 1:33 PM GMT
Next Story