Telugu Global
Telangana

హైదరాబాద్‌కు క్యూ కడుతున్న టెక్నికల్ టాలెంట్.. లింక్డ్‌ఇన్ అధ్యయనంలో వెల్లడి

ఒకప్పుడు టెక్ నిపుణులు ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌కు పూణే, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి టెక్ నిపుణులు వస్తున్నారు.

హైదరాబాద్‌కు క్యూ కడుతున్న టెక్నికల్ టాలెంట్.. లింక్డ్‌ఇన్ అధ్యయనంలో వెల్లడి
X

గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ నగరం వేగంగా ఎదుగుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు టెక్ టాలెంట్‌ను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన నగరంగా ఉన్న హైదరాబాద్.. ప్రస్తుతం వారిని ఆకర్షించే పనిలో ఉన్నది. దేశ విదేశాల్లో ఉన్న టెక్నికల్ టాలెంట్ ఇప్పుడు హైదరాబాద్‌లో అవకాశాల కోసం క్యూ కడుతున్నట్లు ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ అధ్యయనంలో తేలింది.

ఒకప్పుడు టెక్ నిపుణులు ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌కు పూణే, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి టెక్ నిపుణులు వస్తున్నారు. దేశంలో తమ మొదటి ఛాయిస్‌గా హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు లింక్డ్‌ఇన్ తెలిపింది. హైదరాబాద్‌లో ప్రముఖ కంపెనీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ)లు నెలకొల్పడంతో పాటు భారీ విస్తరణలు కూడా చేపట్టాయి.

లింక్డ్ఇన్ చేపట్టిన 'ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్: స్టేట్ ఆఫ్ వర్క్ ఎట్ ఏఐ' అధ్యయనంలో అనేక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఐటీ సర్వీసులు, సంబంధిత రంగాల్లో టెకీలకు డిమాండ్ పెరగడమే కాకుండా.. నగరంలో ఇతర రంగాల్లో కూడా భారీ పెరుగుదల గమనించినట్లు తెలిపింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్య్స్యూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)తో పాటు హెల్త్‌కేర్ రంగంలో నగరం వేగంగా ఎదుగుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెగా స్కిల్స్ (ఒకే వ్యక్తికి పలు టెక్నాలజీల్లో నైపుణ్యం) టెకీలు 20 శాతం హైదరాబాద్‌లో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నగరం ఇప్పుడు ఎంతో మంది టాలెంటెడ్ టెకీలను కలిగి ఉన్నదని. ఇతర నగరాల నుంచి కూడా హైదరాబాద్‌కు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పలు సంస్థలు కూడా ఇక్కడ విస్తరణ చేపట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఐటీ, ఐటీఈఎస్ రంగంలోనే ఎక్కవ మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగాల్లో మాత్రమే కాకుండా మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్స్ రంగంలో కూడా భారీ డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. నగరంలో టాప్-3 నాన్ ఐటీ సెక్టార్లలో ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్, స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్, ఫార్మా రంగంలో అత్యధిక ఉద్యోగాలు వస్తున్నట్లు లింక్డ్‌ఇన్ తెలిపింది.

తెలంగాణలో ఉన్న టెక్ టాలెంట్‌లో 95 శాతం హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నట్లు పేర్కొన్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న కంపెనీల్లో అత్యధికంగా ఉద్యోగాలు పొందుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో ఉద్యోగాలు పొందుతున్నవారిలో సేల్స్ రిక్రూటర్ 20 శాతం, ఇంటర్న్17 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నది.


First Published:  25 Aug 2023 1:38 AM GMT
Next Story