Telugu Global
Telangana

టీచర్ కాదు సైకో.. విద్యార్థితో 100 గుంజీలు.. తీవ్ర అస్వస్థత

తమ కొడుకు 4 రోజులుగా మంచం పట్టడంతో తండ్రి సమీయొద్దీన్.. పాఠశాల కరస్పాండెంట్ ఖాజాలాల్‌ను ప్రశ్నించగా రూ.లక్ష ఇస్తా.. ఎక్కడైనా హాస్పిటల్‌లో చూపించుకోమని వెటకారంగా బదులిచ్చినట్లు సమాచారం.

టీచర్ కాదు సైకో.. విద్యార్థితో 100 గుంజీలు.. తీవ్ర అస్వస్థత
X

పిల్లలకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్పించాల్సిన ఓ టీచర్ సైకోలా మారాడు. మార్కులు తక్కువొచ్చాయని 8వ తరగతి స్టూడెంట్‌ చేత 100 గుంజీలు తీయించాడు. దీంతో సదరు విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నడవలేని స్థితిలో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని ఎస్వీఎస్ సెంట్రల్ స్కూల్‌లో చోటుచేసుకుంది. 8వ తరగతి విద్యార్థి మహ్మద్ ఇస్మాయిల్‌కు యూనిట్ టెస్ట్‌లో తెలుగు సబ్జెక్ట్‌లో 5మార్కులు తక్కువ వచ్చాయని టీచర్ నాగిరెడ్డి 100 గుంజీలు తీయించాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.

తమ కొడుకు 4 రోజులుగా మంచం పట్టడంతో తండ్రి సమీయొద్దీన్.. పాఠశాల కరస్పాండెంట్ ఖాజాలాల్‌ను ప్రశ్నించగా రూ.లక్ష ఇస్తా.. ఎక్కడైనా హాస్పిటల్‌లో చూపించుకోమని వెటకారంగా బదులిచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై తాజాగా విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విద్యార్థి పట్ల ఇటువంటి అమానుష చర్యకు పాల్పడ్డ సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇటీవల దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా.. మరికొందరు ఇటువంటి హేయమైన చర్యలకు దిగుతున్నారు. ఇటువంటి ఘటనలకు సంబంధించి దేశంలో కఠిన చట్టాలు రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సదరు వ్యక్తి టీచర్ గా పనికిరాడని.. అటువంటి వారిని ఉపాధ్యాయులుగా పనిచేయకుండా శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. ఈ ఘటనపై విద్యాశాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  17 Dec 2022 1:47 PM GMT
Next Story