Telugu Global
Telangana

టీ-హబ్ ఒక అద్భుతం.. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి ప్రశంసలు

భవిష్యత్ ఏది? భవిష్యత్ ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే.. అదంతా టీ-హబ్‌లాంటి ప్రదేశంలోనే కనిపిస్తుందని ప్రశంసలు కురిపించారు.

టీ-హబ్ ఒక అద్భుతం.. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి ప్రశంసలు
X

హైదరాబాద్‌ను సందర్శించే వాళ్లు ఎవరైనా.. నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి అవాక్కవుతున్నారు. ప్రపంచ స్థాయి నగరాలకు ధీటుగా హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ జాబితాలో ఇండియాలో అమెరికా అంబాసిడర్ (రాయబారి) ఎరిక్ గార్సెటి కూడా చేరారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'టీ-హబ్'ను కూడా సందర్శించారు. హైదరాబాద్ అపురూపం అయితే టీ-హబ్ ఒక అద్బుతం అంటూ గార్సెటి ప్రశంసలు కురిపించారు.

టీ-హబ్‌కు వచ్చిన ఎరిక్ గార్సెటిని అక్కడి అధికారులు సాదరంగా ఆహ్వానించారు. టీ-హబ్‌లో జరుగుతున్న ఆవిష్కరణలు, ఇతర కార్యక్రమాలను కూలంకషంగా వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో టీ-హబ్ ఎలా సక్సెస్ అయ్యిందో రాయబారి ఎరిక్ గార్సెటికి వివరించారు. ఈ సందర్భంగా గార్సెటి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇది నా తొలి పర్యటన. చాలా ఉత్సాహంగా ఇక్కడకు వచ్చాను. భవిష్యత్ ఏది? భవిష్యత్ ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే.. అదంతా టీ-హబ్‌లాంటి ప్రదేశంలోనే కనిపిస్తుందని ప్రశంసలు కురిపించారు.

నేను కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తిని. అక్కడ అత్యంత ప్రతిభావంతులు, స్మృజనాత్మకత కలిగిన పారిశ్రామికవేత్తలు కనపడుతుంటారు. అయితే అంతటి స్మృజనాత్మకత, ప్రతిభ ఈ రోజు టీ-హబ్‌లో చూస్తున్నారు. ఇక్కడి యువ ఆవిష్కర్తలను చూసి.. నాకు కాలిఫోర్నియాలో ఉన్న అనుభూతి కలుగుతోందని అన్నారు. టీ-హబ్ నన్ను ఎంతో ఆకట్టుకున్నదని ఆయన చెప్పారు. త్వరలోనే ఇండియా ప్రీమియర్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా మారుతుందని. అందులో టీ-హబ్ కీలక పాత్ర పోషిస్తుందని ఎరిక్ గార్సెటి చెప్పారు.

టీ-హబ్ సందర్శన అనంతరం గార్సెటి, గవర్నర్‌ తమిళిసైతో కలిసి కొత్త యూఎస్ కాన్సులేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ క్యాంపస్‌లను సందర్శించారు. హైదరాబాద్‌లో నిర్మించిన యూఎస్ కాన్సులేట్ గురించి చాలా మంది గొప్పగా చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే.. హైదరాబాద్ అందరి కోసం సృష్టించిన నగరంగా కనిపిస్తోందని అన్నారు. ఇండియా - అమెరికా భాగస్వామ్యం.. ఇరు దేశ ప్రజల లోతైన సంబంధాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో చూస్తుంటే ప్రెసిడెంట్ చెప్పింది నిజమని అనిపిస్తుందని చెప్పారు. అనంతరం ఓల్డ్ సిటీలోని చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించి అక్కడే విందు ఆరగించారు.



First Published:  27 May 2023 1:17 AM GMT
Next Story