Telugu Global
Telangana

తెలంగాణ ఫలితాలపై చంద్రబాబు ఏమన్నారంటే..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ చంద్రబాబు జోక్యం ఉంటుందని ప్రచారం చేసింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని విమర్శలు చేసింది.

తెలంగాణ ఫలితాలపై చంద్రబాబు ఏమన్నారంటే..?
X

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా టీడీపీ శ్రేణులకు కీలక సందేశం ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై ఏ విధంగా స్పందించాలో తగిన సూచనలు ఇచ్చారు.

'తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనప్పటికీ అది ఆ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం. దానిని అన్ని పార్టీల్లాగే మనం కూడా శిరోధార్యంగా భావించాలి. ఫలితాలను చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన అభ్యర్థులకు, లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి. ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. 40 సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొని అధికారపక్షం పాత్ర అయినా, ప్రతిపక్షం పాత్ర అయినా.. పార్టీ పరంగా కానీ.. నాయకులు, కార్యకర్తల పరంగా కానీ.. మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించాం. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఏపీలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై దృష్టి పెడదాం' అంటూ ట్విట్టర్ ద్వారా చంద్రబాబు, లోకేష్ తమ అభిప్రాయాలను వెల్లడించారు.


శ్రేణులకు సందేశం ఇచ్చింది అందుకేనా..?

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయినా, రేవంత్ రెడ్డి వేరే పార్టీలో చేరినా చంద్రబాబుకు ఆయన తగిన గౌరవం ఇస్తూ వచ్చారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చింది మొదట టీడీపీనేనని కొద్దిరోజుల కిందట కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ చంద్రబాబు జోక్యం ఉంటుందని ప్రచారం చేసింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని విమర్శలు చేసింది. ఈ ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వెంటనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. తెలంగాణలో ఓడిపోయిన పార్టీని పలుచన చేసే విధంగా మాట్లాడవద్దని గట్టిగా సూచించారు. ఒకవేళ అలా చేస్తే బీఆర్ఎస్ చేసిన ప్రచారం నిజమైనట్లుగా ఉంటుందని భావించి ముందే చంద్రబాబు పార్టీ శ్రేణులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

First Published:  3 Dec 2023 12:34 PM GMT
Next Story