Telugu Global
Telangana

రేవంత్‌కు బాలయ్య శుభాకాంక్షలు

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు టీడీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో చేరిన తర్వాతే రేవంత్ రెడ్డి నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

రేవంత్‌కు బాలయ్య శుభాకాంక్షలు
X

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న త‌రుణంలో ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేవంత్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. 'తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు.

తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆంక్షలు నెరవేర్చాలి. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రిగా మీ మార్క్ పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను' అంటూ బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ముందు టీడీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో చేరిన తర్వాతే రేవంత్ రెడ్డి నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. బాలకృష్ణతో కూడా రేవంత్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రకటన వచ్చిన వెంటనే బాలకృష్ణ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించిన‌ప్పటి నుంచి పలువురు టీడీపీ నాయకులు, ఏపీకి చెందిన ఇతర పార్టీల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ, రేవంత్ రెడ్డి గురువుగా భావించే చంద్రబాబు కానీ, ఆయన తనయుడు నారా లోకేష్ కానీ, ఇంతవరకు స్పందించక పోవడం గమనార్హం.

First Published:  6 Dec 2023 6:22 AM GMT
Next Story