Telugu Global
Telangana

తెలంగాణ వైపు వైసీపీ, టీడీపీ చూపు?

కేసీఆర్.. బీఆర్ఎస్ పేరుతో ఏపీలో కూడా సభలు నిర్వహించాలని భావిస్తుండటంతో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. తెలంగాణను వదిలేసిన వైసీపీ, టీడీపీ మరోసారి ఆ రాష్ట్రంలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

తెలంగాణ వైపు వైసీపీ, టీడీపీ చూపు?
X

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఒకే రాష్ట్రానికి పరిమితం అయిన పార్టీలు బీఆర్ఎస్ ఆవిర్భావంతో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇన్నాళ్లూ తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ఉన్న టీఆర్ఎస్.. పేరు మార్చుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. ఇకపై బీఆర్ఎస్ ఎజెండాలో తెలంగాణ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కూడా ఉండబోతున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్‌తో ఆంధ్రా పార్టీలుగా ముద్రపడిన వైసీపీ, టీడీపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా చేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఏపీలో కూడా సభలు నిర్వహించాలని భావిస్తుండటంతో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. తెలంగాణను వదిలేసిన వైసీపీ, టీడీపీ మరోసారి ఆ రాష్ట్రంలో తమ బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఒక ఎంపీ సీటుతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకున్నది. అయితే ఆ తర్వాత వైసీపీ అధినేత సీఎం జగన్ తెలంగాణ రాజకీయాలను వదిలేశారు. పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టిపెట్టారు. దీంతో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి జగన్ అసలు తెలంగాణ వైపే చూడటం లేదు. టీడీపీ మాత్రం తెలంగాణలో తమకు ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకునే క్రమంలో 2018 ఎన్నికల్లో కూడా పోటీ చేసింది.అప్పుడు కూడా తెలుగుదేశం రెండు అసెంబ్లీ సీట్లను గెలిచింది. అయితే టీడీపీ తరపున గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ కూడా పార్టీని వీడి టీఆర్ఎస్‌కు వెళ్లిపోయారు.

తెలంగాణలో టీడీపీని కేసీఆర్ దాదాపు బలహీనపరిచారు. అయినా సరే చంద్రబాబు మాత్రం ఇక్కడి తెలుగుదేశం పార్టీని వదిలేయలేదు. పార్టీని వదిలి వెళ్లిపోయిన నాయకుల స్థానంలో కొత్త బాధ్యులను నియమించుకుంటూ వచ్చారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఓట్లు వేసే వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో టీడీపీకి మంచి మద్దతు ఉన్నది. ఈ ఓట్ బ్యాంకును కాపాడుకుంటే టీడీపీ కచ్చితంగా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది. అయితే టీఆర్ఎస్ బలంగా ఉండటంతో చంద్రబాబు ఇన్నాళ్లు తెలంగాణలో పోటీకి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పోటీకి దిగబోతున్నారని తెలవడంతో చంద్రబాబు కూడా తెలంగాణపై మరోసారి ఫోకస్ చేసినట్లు తెలుస్తున్నది.

ఇక, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు ఇంకా బయటకు రాలేదు. బీఆర్ఎస్ కనుక ఏపీలో పోటీకి దిగితే తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉందని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైసీపీని నేరుగా బరిలోకి దింపుతారా? లేదంటే షర్మిల పార్టీకి మద్దతు ఇస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి తెలుగుదేశం ఆలోచించినంత తీవ్రంగా తెలంగాణ రాజకీయాలపై వైసీపీ ఆలోచించడం లేదని మాత్రం తెలుస్తోంది. బీఆర్ఎస్ కనుక ఏపీలో పోటీకి దిగితే ఈ రెండు పార్టీలు తెలంగాణలో మరోసారి అడుగుపెడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  8 Oct 2022 8:12 AM GMT
Next Story