Telugu Global
Telangana

పొంగులేటి డబ్బుతో దేన్నయినా కొనొచ్చనుకుంటున్నారు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ పరిజ్ఞానం లేదని, డబ్బుతో దేన్నయినా కొనొచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నారని తాతా మధు విమర్శించారు.

పొంగులేటి డబ్బుతో దేన్నయినా కొనొచ్చనుకుంటున్నారు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
X

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఖండించారు. సోమవారం బోనకల్లులో మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన పొంగులేటి ప్రభుత్వ పథకాలపై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎవరికీ సక్రమంగా పథకాలు అమలు కావడం లేదని, ఉచిత విద్యుత్ ఎవరికీ అందడం లేదని ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా తాతా మధు ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పందించారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ పరిజ్ఞానం లేదని, డబ్బుతో దేన్నయినా కొనొచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నారని విమర్శించారు. రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌పై ఆయన ఇప్పుడు అసత్య ప్రచారం చేస్తున్నారు. కల్లూరు మండలం నారాయణపురంలోని ఆయన 40 ఎకరాల మామిడి తోటకు ఉచిత విద్యుత్ అందడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలా కాదని ఆయన బహిరంగ విచారణకు సిద్ధపడతారా అని సవాలు విసిరారు. మీడియా సమక్షంలోనే ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని తాతా మధు అన్నారు.

ఖమ్మం జిల్లాలో రాజకీయాలను కలుషితం చేసి.. ధన రాజకీయాలను ఆయన ప్రోత్సహిస్తున్నారని.. త్వరలోనే ప్రజలు ఆయనకు బుద్ది చెస్తారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంతో లబ్దిపొంది.. అవే డబ్బుతో సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని మధు ఆరోపించారు. సీఎం కేసీఆర్ చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే ఎంతో మంది పలు పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరారని చెప్పారు. కానీ, తన వల్లే పార్టీలో చేరారని పొంగులేటి చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. పొంగులేటి మాటలు, వ్యవహారశైలి చూస్తే బీజేపీ, వైఎస్ఆర్టీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లే ఉందని అన్నారు.

First Published:  1 Feb 2023 9:35 AM GMT
Next Story