Telugu Global
Telangana

టార్గెట్ రూ.50 లక్షలు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితుల లక్ష్యం..?

రేణుక తమ్ముడు కేతావత్ రాజేశ్వర్, డాక్యాలు కలిసి ఆ ప్రశ్నాపత్రాలు అమ్మేసి రూ.50 లక్షలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది.

టార్గెట్ రూ.50 లక్షలు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితుల లక్ష్యం..?
X

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అనేక చిక్కుముడులను 'సిట్' ఒక్కొక్కటిగా విప్పుతోంది. ఇన్నాళ్లూ ఈ ప్రశ్నాపత్రాలు కొన్న రేణుక, డాక్యానాయక్ దంపతులు వారి బంధువులకు ఇచ్చారని భావించారు. అయితే ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రశ్నాపత్రాలు తీసుకున్న డాక్యా నాయక్ వాటి అమ్మకం ద్వారా అర కోటి రూపాయ‌ల‌ వరకు సంపాదించాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తున్నది.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ పీఏగా పనిచేసిన ప్రవీణ్ కుమార్‌కు ఈ వ్యవహారంలో రూ.16 లక్షల మేర ముట్టినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏఈ సివిల్ నియామక ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్ కుమార్.. గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలైన రేణుకా రాథోడ్‌, ఆమె భర్త డాక్యానాయక్‌కు ఇచ్చేందుకు రూ.10 లక్షల బేరం మాట్లాడుకున్నాడు. తన తమ్ముడి కోసం ఏఈ ప్రశ్నాపత్రం కావాలని తీసుకున్న రేణుక.. దానిని భర్త డాక్యాకు ఇచ్చింది.

కాగా, రేణుక తమ్ముడు కేతావత్ రాజేశ్వర్, డాక్యాలు కలిసి ఆ ప్రశ్నాపత్రాలు అమ్మేసి రూ.50 లక్షలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఐదుగురు వ్యక్తులతో రూ.10 లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నారు. అయితే వారికి పూర్తిస్థాయిలో డబ్బులు అందలేదు. ప్రశ్నాపత్రం అందుకున్న నీలేశ్ నాయక్ రూ.4.95 లక్షలు, గోపాల్ నాయక్ రూ.8 లక్షలు, ప్రశాంత్ రెడ్డి రూ.7.5 లక్షలు, రాజేంద్ర కుమార్ రూ.5 లక్షలు, జనార్థన్ రూ.1.95 లక్షలు ఇచ్చారు. ఇలా ఐదుగురి నుంచి రూ.27.4 లక్షలు అందాయి. ఒక్క జనార్ధన్ మాత్రమే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేయగా.. మిగిలిన వాళ్లు నగదు రూపంలోనే డబ్బులు ఇచ్చారు. ఇలా వచ్చిన డబ్బు నుంచి రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చారు.

మరోవైపు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నాపత్రాన్ని ఖమ్మంకు చెందిన సాయి లౌకిక్, సాయి సుస్మిత దంపతులకు ప్రవీణ్ రూ.6 లక్షలకు అమ్మాడు. దీంతో మొత్తం రూ.16 లక్షలు ప్రవీణ్ వద్దకు చేరాయి. ఖమ్మం దంపతులు ఇచ్చిన డబ్బు బాలాపూర్ క్రాస్ రోడ్డులోని ఎస్‌బీఐ బ్రాంచ్ ఖాతాలో ఉంచాడు. దీనిని సిట్ అధికారులు సీజ్ చేశారు. అయితే రేణుక, డాక్య నుంచి వచ్చిన రూ.10 లక్షల నుంచి తన మేనమామకు రూ.3 లక్షలు ఇచ్చాడు. ఈ పేపర్ లీక్ విషయం బయటకు వచ్చిన తర్వాత సిట్ అధికారులకు ప్రవీణ్ మేనమామ శ్రీనివాసరావు రూ.3 లక్షలు అప్పగించాడు.

పేపర్ లీక్ వ్యవహారం కనుక బయటకు రాకపోయి ఉంటే.. డాక్య, రాజేశ్వర్ తాను అనుకున్న రూ.50 లక్షల టార్గెట్ అందుకునే వారని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇంకా కొంచెం సొమ్ము రికవరీ చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు.

First Published:  5 May 2023 6:28 AM GMT
Next Story