Telugu Global
Telangana

50 డేస్ యాక్షన్ ప్లాన్.. రంగంలోకి 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఇదీ టార్గెట్ మునుగోడు

ఒక్కో ఎమ్మెల్యే వెంట 15 మంది టీఆర్ఎస్ నాయకులు ఉండనున్నారు. రాష్ట్ర స్థాయిలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులే ఎమ్మెల్యేల వెంట మునుగోడులో తిరుగనున్నారు.

50 డేస్ యాక్షన్ ప్లాన్.. రంగంలోకి 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఇదీ టార్గెట్ మునుగోడు
X

మునుగోడు విషయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నట్లే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటే అయినా.. అది టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్‌లా తయారయ్యింది. ఓ వైపు బీజేపీ రాష్ట నాయకత్వం మునుగోడు ఉపఎన్నికను వాయిదా వేయించే ప్రయత్నంలో ఉన్నదనే వార్తలు వస్తున్న సమయంలోనే.. కేసీఆర్ 'టార్గెట్ మునుగోడు'కు పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో ఎలాంటి పొరపాటు జరగవద్దని ఆయన పార్టీ వర్గాలకు ఇప్పటికే చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్ విషయంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లే ఓటమికి కారణమయ్యాయని, ఓ విధంగా బీజేపీ దూకుడుకు స్వయంగా టీఆర్ఎస్ అవకాశం ఇచ్చినట్లు అయ్యిందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది.

మునుగోడు ఉపఎన్నిక విషయంలో ఎవరూ కూడా బహిరంగంగా ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయవద్దని తేల్చిచెప్పినట్లు సమాచారం. సెప్టెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వస్తుందని.. అక్టోబర్ ఆఖరుకల్లా ఉపఎన్నిక జరుగుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే 50 రోజల యాక్షన్ ప్లాన్‌కు కేసీఆర్ ఆమోదం తెలిపారు. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఈ '50 రోజుల యాక్షన్' సిద్ధం చేసి కేసీఆర్‌కు సమర్పించినట్లు తెలుస్తుంది. దాన్ని పూర్తిగా పరిశీలించిన కేసీఆర్ ఇప్పటికే ఆమోద ముద్ర కూడా వేశారని సమాచారం.

50 రోజుల యాక్షన్ ప్లాన్‌కు అవసరమైన సాయాన్ని కేసీఆర్ చేస్తానని హామీ ఇచ్చారు. శనివారం జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం నల్గొండ నాయకులతో మాట్లాడి ఈ మేరకు ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏర్పాటు చేస్తానని, వారికి ఇంచార్జులుగా బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారు. తాను త్వరలోనే మంత్రి జగదీశ్ రెడ్డికి ఈ మేరకు ఎమ్మెల్యేల లిస్టు పంపిస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ నెల 10న గణేష్ నిమజ్జనం ఉండటంతో.. అప్పటి లోగానే ఎమ్మెల్యేలను మునుగోడుకు కేటాయించనున్నట్లు తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 1500 మంది కార్యకర్తలు, నేతలు ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతీ మండలం, గ్రామం, మున్సిపాలిటీల్లో పర్యటించేలా ప్లాన్ రూపొందించారు. వీళ్లతో పాటు పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కూడా దశల వారీగా పర్యటనలు చేయనున్నారు. బై ఎలక్షన్‌కు సంబంధించి నల్గొండ నేతలు ఇచ్చిన రిపోర్ట్ బాగుండటంతోనే కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలను కూడా కేటాయిస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలోని 178 గ్రామాలకు గాను, రెండు గ్రామాలకు కలిపి ఓ ఎమ్మెల్యేను ఇంచార్జీగా నియమించనున్నారు. రాబోయే 50 రోజలు వీళ్లు ఆయా గ్రామాల్లోనే ఉండి.. టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయనున్నట్లు తెలుస్తుంది.

ఒక్కో ఎమ్మెల్యే వెంట 15 మంది టీఆర్ఎస్ నాయకులు ఉండనున్నారు. రాష్ట్ర స్థాయిలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులే ఎమ్మెల్యేల వెంట మునుగోడులో తిరుగనున్నారు. ప్రతీ ఎమ్మెల్యే ఈ 50 రోజుల్లో స్వయంగా తమకు కేటాయించిన రెండు గ్రామాల్లోని ప్రతీ ఓటర్ వద్దకు వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పథకాలైన ఆసరా పెన్షన్లు, దళిత బంధు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లబ్ది పొందిన వారిని కలువనున్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఈ పథకాల ద్వారా చెక్కుల పంపిణీని ఎమ్మెల్యేలే చేయనున్నారు. అలా ఓటర్లకు టీఆర్ఎస్‌ను చేరువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి ఉన్న యంత్రాంగాన్ని మొత్తం మునుగోడు ఉపఎన్నికకు వాడనున్నట్లు తెలుస్తుంది. పార్టీ ప్రణాళిక చూస్తే మునుగోడుపై ఎంత ఫోకస్ పెట్టిందో అర్థం అవుతుంది.

First Published:  5 Sep 2022 9:44 AM GMT
Next Story