Telugu Global
Telangana

టార్గెట్ కేసీఆర్.. బీజేపీ సక్సెస్ అవుతుందా..?

కవిత పేరును, వైసీపీ ఎంపీతో పాటు ఆయన కొడుకు మాగుంట రాఘవ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పేర్లను చార్జిషీటులో చేర్చటం ద్వారా రాజకీయంగా బీజేపీ లబ్దికోసమే ప్రయత్నిస్తోందనే విషయం జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. ఏపీ విషయాన్ని వదిలేస్తే ముఖ్యంగా తెలంగాణా విషయంపైనే విస్తృతమైన చర్చ పెరిగిపోతోంది.

టార్గెట్ కేసీఆర్.. బీజేపీ సక్సెస్ అవుతుందా..?
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు పార్టీలను బ్యాలెన్స్ చేస్తున్నట్లే ఉంది. ఈడీ దర్యాప్తు వెనకాల బీజేపీ ఉందో లేదో స్పష్టంగా చెప్పలేం కానీ బ్యాలెన్సింగ్ మాత్రం పక్కాగా కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన చార్జిషీటులో తెలంగాణాలో కల్వకుంట్ల కవిత, ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరి బంధువులను చేర్చింది.

కవిత పేరును, వైసీపీ ఎంపీతో పాటు ఆయన కొడుకు మాగుంట రాఘవ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పేర్లను చార్జిషీటులో చేర్చటం ద్వారా రాజకీయంగా బీజేపీ లబ్దికోసమే ప్రయత్నిస్తోందనే విషయం జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. ఏపీ విషయాన్ని వదిలేస్తే ముఖ్యంగా తెలంగాణా విషయంపైనే విస్తృతమైన చర్చ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కేసీఆర్ పదేపదే సవాళ్ళు చేస్తుండటమే. అంతటితో ఆగకుండా ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ ను జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతున్నట్లుంది.

బీజేపీకి దీటుగా బీఆర్ఎస్ ఎదగటాన్ని కమలనాధులు జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్ ఏర్పాటు ద్వారా కేసీఆర్ ముందు రైతాంగంపై దృష్టిపెట్టడాన్ని బీజేపీ పెద్దలకు ఇబ్బందిగా మారినట్లుంది. మనదేశంలో మెజారిటీ జనాలు రైతులే కాబట్టి కేసీఆర్ దృష్టి వ్యవసాయరంగంపైనే పడింది. సో, బీఆర్ఎస్ ఎదుగుదలను మొగ్గలోనే తుంచేసేందుకే బీజేపీ పెద్దలు దర్యాప్తు సంస్థ‌లను పావుగా వాడుకుంటున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.

బీఆర్ఎస్ ను మొగ్గలోనే తుంచేయాలంటే కేసీఆర్ ను టచ్ చేయలేరు. అందుకనే ఆయన కూతురు కవితను లిక్కర్ స్కామ్ లో ఇరికించినట్లు జనాల్లో చర్చ జరుగుతోంది. మరి దీని ప్రభావం ఇప్పటికిప్పుడు కనిపించకపోవచ్చు కానీ వచ్చేఎన్నికల్లో మాత్రం కచ్చితంగా కనబడతుందనే అనుకోవచ్చు. ఏదేమైనా దర్యాప్తు సంస్ధలను అధికారపార్టీ వెనకనుండి నడిపించటం మనదేశంలో కొత్తేమీకాదు. కాకపోతే ఒకప్పుడు ఈ విషయం బయటపడేది కాదు నరేంద్రమోడీ సర్కార్ హయాంలో చాలా ఎక్కువైపోవటంతో మామూలు జనాలు కూడా మాట్లాడేసుకుంటున్నారంతే.

First Published:  21 Dec 2022 5:39 AM GMT
Next Story