Telugu Global
Telangana

టీ వర్క్స్.. మార్చి 2న ప్రారంభం కానున్న దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్

నూతన ఆవిష్కరణలకు మరింత ఊతం ఇచ్చేలా దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ (నమూనా కేంద్రం)ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

టీ వర్క్స్.. మార్చి 2న ప్రారంభం కానున్న దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్
X

హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలకు హబ్‌గా మారింది. యువత ఉద్యోగాల కోసం ఆరాట పడకుండా.. ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగాలని మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. టీ-హబ్ ద్వారా అనేక స్టార్టప్స్ పురుడు పోసుకుంటున్నాయి. ఇప్పటికే టీ-హబ్ రెండో దశ కూడా ప్రారంభించారు. ఇక నూతన ఆవిష్కరణలకు మరింత ఊతం ఇచ్చేలా దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ (నమూనా కేంద్రం)ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

టీ-వర్క్స్ పేరుతో నిర్మించిన అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్‌ను మార్చి 2న ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. టీ-వర్క్స్ భవనానికి సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 'ఇండియాలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ అయిన టీ-వర్క్స్ మార్చి 2న ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. టీ-వర్క్స్.. నూతన ఆవిష్కరణల్లో ఇండియా అగ్రగామిగా మారడానికి చేయాల్సిన ప్రయాణాన్ని వేగవంతం చేయనున్నదని' కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

టీ-వర్క్స్ కూడా తమ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన విశేషాలను తెలియజేసింది. '78,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రోటో టైపింగ్ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి పరికరాలు నమూనాల రూపకల్పనకు ఎంతో సహాయపడతాయి. ఇండియా యొక్క ఉత్పత్తి ఆవిష్కరణ ప్రయాణాన్ని టీ-వర్క్స్ నుంచి ప్రారంభిద్దాం. ఈ సెంటర్ ప్రారంభోత్సవం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము' అని ట్విట్టర్‌లో పేర్కొన్నది.

First Published:  27 Feb 2023 11:48 AM GMT
Next Story