Telugu Global
Telangana

టీ-వ్యాలెట్.. డిజిటల్ రంగంలో ఓ అద్భుతం

డిజిటల్ పేమెంట్లకు ఉన్న ప్రధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీ-వ్యాలెట్ రూపకల్పనకు నడుంభిగించిందని జయేశ్ రంజన్ చెప్పారు.

టీ-వ్యాలెట్.. డిజిటల్ రంగంలో ఓ అద్భుతం
X

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ-వ్యాలెట్ డిజిటల్ రంగంలో ఒక అద్భుతమని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. టీ-వ్యాలెట్ ద్వారా పల్లెలకు కూడా బ్యాంకింగ్ సేవలను మరింత దగ్గర చేశామని ఆయన చెప్పారు. హెచ్ఐసీసీలో జీ20 సమావేశాల సన్నాహకాల్లో భాగంగా గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (GPFI) రెండవ సెషన్‌లో జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. దక్షిణ ఆసియా దేశాలు టీ-వ్యాలెట్‌ను ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని అన్నారు. ఇప్పటి వరకు ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌పై 3.5 కోట్ల లావాదేవీలు జరిగాయన ఆయన వెల్లడించారు.

2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సమయంలో బ్యాంకుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆనాడే డిజిటల్ పేమెంట్లకు ఉన్న ప్రధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీ-వ్యాలెట్ రూపకల్పనకు నడుంభిగించిందని జయేశ్ రంజన్ చెప్పారు. ప్రజల భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి దేశంలోనే తొలి డిజిటల్ వ్యాలెట్ తీసుకొచ్చిన ఘతన తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు.

గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో కూడా టీ-వ్యాలెట్ అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా లావాదేవీల్లో మానవ ప్రమేయం లేకుండా టీ-వ్యాలెట్ ద్వారా తగ్గించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూత ఇప్పుడు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే పడుతున్నాయని అన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్స్, రైతుబంధు వంటి సాయం.. ఎవరితో సంబంధం లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని అన్నారు.

టీ-వ్యాలెట్‌కు ప్రస్తుతం 1.39 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారని.. మూడున్నర కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. ఈ వ్యాలెట్ ఉపయోగించి ఏదైనా బ్యాంకు ఖాతాకు నగదును బదిలీ చేసుకోవచ్చని.. ఇందుకోసం ఎలాంటి సర్వీస్ చార్జీలు తీసుకోవట్లేదని అన్నారు. టీ-వ్యాలెట్ ఉపయోగించాలంటే మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదన్నారు. టీ-వ్యాలెట్ మనుగడలోకి వచ్చిన తర్వాత సుమారు రూ.205 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. గత ఏడేళ్లలో 1,169 సర్వీసులను టీ-వ్యాలెట్ ద్వారా అందించామని జయేశ్ రంజన్ వెల్లడించారు.


First Published:  6 March 2023 3:25 AM GMT
Next Story