Telugu Global
Telangana

టీ-హబ్‌కు నేషనల్ టెక్నాలజీ అవార్డు

దేశంలో బెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా టీ-హబ్‌ను కేంద్రం ప్రభుత్వం గుర్తించిందని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

టీ-హబ్‌కు నేషనల్ టెక్నాలజీ అవార్డు
X

తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలో నిర్వహిస్తున్న టీ-హబ్ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును గెలుచుకున్నది. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ విభాగంలో నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ను కేంద్ర ప్రభుత్వం టీ-హబ్‌కు అందించింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న నేషనల్ టెక్నాలజీ వీక్ ఎక్స్‌పోలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో.. టీ-హబ్ ప్రతినిధులకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ అవార్డును అందించారు. టీ-హబ్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. దేశంలో బెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా టీ-హబ్‌ను కేంద్రం ప్రభుత్వం గుర్తించిందని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. టీమ్ టీ-హబ్‌కు నా అభినందనలని కేటీఆర్ చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి దశ విజయవంతం కావడంతో ప్రభుత్వం రెండో దశను మరింత భారీగా చేపట్టింది. దాదాపు రూ.400 కోట్ల వ్యయంతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్ 2.0ను గత ఏడాది జూన్ 28న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రెండో దశలో ఏకంగా నాలుగు వేల స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు సాగించేలా వసతులు కల్పించారు. రెండో దశ టీ-హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా రికార్డులకు ఎక్కింది.

స్టార్టప్‌ల కోసం ప్రత్యేక యంత్రాంగం..

దేశంలో స్టార్టప్‌ల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. స్టార్టప్‌ల ప్రారంభం, వాటి అభివృద్ధిని ఈ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. ఇలాంటి యంత్రంగం ఉండటం ఇప్పుడు తప్పకుండా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రత్యేక యంత్రాంగం ఉండటం వల్ల స్టార్టప్‌లకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక తోడ్పాటును అందించేందుకు వీలుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.


First Published:  14 May 2023 11:29 AM GMT
Next Story