Telugu Global
Telangana

టీ-డయాగ్నస్టిక్స్ సూపర్ సక్సెస్.. మంత్రి హరీశ్ రావుకు అభినందనలు : మంత్రి కేటీఆర్

తెలంగాణ డయాగ్నస్టిక్స్ రాష్ట్రమంతా విజయవంతంగా విస్తరించడంలో చొరవ తీసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

టీ-డయాగ్నస్టిక్స్ సూపర్ సక్సెస్.. మంత్రి హరీశ్ రావుకు అభినందనలు : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ (టీడీ) గొప్ప విజయాన్ని అందుకున్నది. పేదల వైద్య ఖర్చుల భారాన్ని ఈ పథకం గణనీయంగా తగ్గించిందని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 2018 జనవరిలో హైదరాబాద్‌లో ఒక హబ్‌గా ప్రారంభమైన టీ-డయాగ్నస్టిక్స్.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రలకు, పట్టణాలకు విస్తరించడం అభినందనీయం అన్నారు.

తెలంగాణ డయాగ్నస్టిక్స్ రాష్ట్రమంతా విజయవంతంగా విస్తరించడంలో చొరవ తీసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హబ్, స్పోక్ మోడల్ ద్వారా ఈ సేవలు అందుతున్నాయి. బస్తీ దవాఖానాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్పోక్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హబ్‌కు చేరిన నమూనాలతో పరీక్షల ఫలితాలు అందిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.

రక్తం, మూత్రం వంటి పాథలాజికల్ సేవలు ఉచితంగా అందిస్తున్నది. అలాగే ఎక్స్‌రే, యూఎస్‌జీ, ఈసీజీ, 2డీ ఎకో, మమ్మోగ్రామ్ వంటి ఇమేజింగ్ సర్వీసులు కూడా ఉచితంగానే ప్రభుత్వం అందిస్తున్నది. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి 57.68 లక్షల రోగులకు, 10.40 కోట్ల పరీక్షలు ఉచితంగా చేసినట్లు కేటీఆర్ చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా 134 పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్నీ ఉచితంగానే లభిస్తాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ కూడా హబ్, స్పోక్ మోడల్‌లో డయాగ్నస్టిక్స్ సేవలు అందించడాన్ని ప్రశంసించిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.


First Published:  2 July 2023 8:55 AM GMT
Next Story