Telugu Global
Telangana

ఎయిర్‌పోర్ట్ మెట్రో కన్సల్టెంట్‌గా సిస్ట్రా.. మరో రెండు సంస్థలతో కలిసి బిడ్

ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన ఈపీసీ టెండర్ డాక్యుమెంట్లను ఈ కన్సార్టియం త్వరలో తయారు చేస్తుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రో కన్సల్టెంట్‌గా సిస్ట్రా.. మరో రెండు సంస్థలతో కలిసి బిడ్
X

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్ పోర్ట్ మెట్రో పనుల్లో ముందడుగు పడింది. ఇప్పటికే మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు సర్వే పనులు పూర్తయ్యాయి. రూ.6,250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెట్రో 31 కిలోమీటర్ల పొడవు ఉండనున్నది. ప్రభుత్వమే పూర్తిగా ఈ మెట్రో వ్యయాన్ని భరించనున్నది. ఐటీ సెక్టార్ నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారికి ఈ మెట్రో చాలా సౌకర్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రోకు జనరల్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా సిస్ట్రా నాయకత్వంలోని కన్సార్టియం ఎంపికైంది. ఇండియన్ రైల్వేస్ అనుబంధ రైట్స్, జర్మనీకి చెందిన డీబీ ఇంజనీరింగ్‌తో కలిసి ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా జనరల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ టెండర్‌ను దక్కించకున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రాకు ఇంజనీరింగ్ విభాగంలో ఎంతో అనునభవం ఉన్నది. మెట్రో రైలు మార్గాల నిర్మాణంలో అగ్రశ్రేణి కన్సల్టెంట్‌గా పేరున్నది. టెక్నికల్ బిడ్స్‌లో ఈ కన్సార్టియం అత్యధిక స్కోర్ సంపాదించడమే కాకుండా, అతి తక్కువగా రూ.98.54 కోట్ల కోట్ చేసి బిడ్ గెలుచుకున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

జనరల్ ఇంజినీరింగ్ టెండర్ గెలుచుకున్న సిస్ట్రా కన్సార్టియం పలు ఇంజనీరింగ్ శాఖలకు చెందిన 18 మంది నిపుణులను, మరో 70 మంది సీనియర్, ఫీల్డ్ ఇంజనీర్లను సమకూర్చనున్నది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు వీళ్లు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ సేవలను అందించనున్నారు. ఈ కన్సార్టియం తొలుత ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ డాక్యుమెంట్లను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ ఆధారంగానే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు.

ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన ఈపీసీ టెండర్ డాక్యుమెంట్లను ఈ కన్సార్టియం త్వరలో తయారు చేస్తుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరించనున్నారు. కాగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్ ) కే. రామకృష్ణారావు, హెచ్ఎండీఏ నుంచి అరవింద్ కుమార్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కూడిన కమిటీ ఈ కన్సార్టియం ఎంపిక కమిటీలో ఉన్నారు.

First Published:  21 April 2023 4:16 AM GMT
Next Story